
భూముల కబ్జా!
ఆగని ఎస్సారెస్పీ
హసన్‌పర్తి: ఎస్సారెస్పీ భూముల్లో రోజురోజుకూ కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. కబ్జాదారులు దర్జాగా ఎస్సారెస్పీ భూముల్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అన్నాసాగరం నుంచి మొదలుకుని పైడిపల్లి వరకు వందలాది నిర్మాణాలు వెలిశాయి. సుమారు 360 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు ఆరేళ్ల క్రితమే అప్పటి అధికారులు సర్వే నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. నివేదిక మేరకు అప్పటి కమిషనర్, కలెక్టర్లు అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు చోద్యం చేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దర్జాగా షెడ్లు..
తాజాగా ఓ క్వారీ నిర్వాహకుడు హసన్‌పర్తి–జయగిరి మార్గమధ్యలోని ఎస్సారెస్పీ భూమిని కబ్జా చేశాడు. దర్జాగా షెడ్లు ఏర్పాటు చేసుకున్నాడు. కబ్జా చేసుకున్న భూమి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఈవ్యవహారం జరిగినప్పటికీ ఎస్సారెస్పీ అధికారుల మౌనంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిగా ఇక్కడ షెడ్లు కంటైనర్లు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్థానికులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం వాటిని బుట్టదాఖలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంపై రాజకీయ ఒత్తిడే కారణమా లేక మామూళ్లు అందుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తొలగింపునకు చర్యలు
ఎస్సారెస్పీ భూములు ఆక్రమించుకుని షెడ్, కంటైనర్లు ఏర్పాటు చేసుకున్న విషయం నా దృష్టికి వచ్చింది. వాటిని తొలగించాలని క్వారీ నిర్వాహకుడికి సూచించాం. లేకపోతే సదరు కబ్జాదారులపైచర్యలు తీసుకుంటాం.
– రవీందర్, డీఈఈ