జగనన్న కాలనీని పరిశీలిస్తున్నమంగరాజు
యలమంచిలి: జగనన్న కాలనీల పూడిక కోసం చించినాడలో తవ్వుతోన్న పెరుగులంక భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందినదేనని మాలమహానాడు జాతీ య అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు అన్నారు. అక్కడ తవ్విన మట్టితో కొంతేరులో పూడ్చిన జగనన్న కాలనీని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దళితుల భూమిలో మట్టి తవ్వి వైఎస్సార్‌సీపీ నాయకులు రూ.లక్షలు దండుకుంటున్నారని, అడ్డొచ్చిన దళితులను కొట్టారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గ్లోబెల్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తన కమిటీ సభ్యులతో ఆ భూముల గురించి తెలుసుకున్నట్టు చెప్పారు.
టీడీపీ హయాంలో ఇదే రామానాయుడు చించినాడలంకలోని దళితుల భూ మిలో మట్టి తీసుకెళ్లి టిడ్కో ఇళ్ల నిర్మాణానికి వాడార ని గుర్తుచేశారు. ఇప్పుడు జగనన్న కాలనీలకు ఇసుక తరలిస్తుంటే దళితుల భూముల్లో ఇసుక తోలుకుపోతున్నారని, అడ్డొచ్చిన దళితులను కొట్టారని రామానాయుడు అసత్య ప్రచారం చేయడం రాజకీయ లబ్థి కోసమే ఎద్దేవా చేశారు. 1983లో ఏనుగువానిలంకలో 52 ఎకరాల పెరుగులంక భూమికి 389, 390 సర్వే నెంబర్లు కేటాయించి, చించినాడకు చెందిన 228 ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారికి డి ఫాం పట్టాలు ఇచ్చారని తెలిపారు. నేడా భూములన్నీ అగ్రవర్ణ టీడీపీ నాయకుల గుప్పిట్లో ఉన్నాయని ఆరోపించారు. రామానాయుడు వారికి కొమ్ము కాస్తూ దళితులకు అన్యాయం జరుగుతుందనడం అవివేకమన్నారు.
ప్రస్తుతం ఆ భూమలపై విచారణ చేసి, అనర్హుల చేతుల్లో ఉంటే స్వాధీనం చేసి పేద దళితులకు పంచాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలుగా చించినాడ గ్రామం సీపీఎం నాయకుల పాలనలో ఉందని, ఆ సమయంలో దళితుల శ్మశాన వాటిక లేదనే సంగతి వారికి తెలియదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో రామానాయుడుకు ఈ సమస్య కనిపించలేదా అన్నారు. ఎవరు మాత్రం దళితులుగా పుట్టాలని కోరుకుంటారని వ్యాఖ్యానించిన చంద్రబాబును దళితులు ఎప్పటికీ నమ్మరని, ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత కులాల మధ్య చిచ్చుపెట్టిన చరిత్రహీనుడని వివరించారు. దళితులంతా గ్రహించి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా వైఎస్సార్‌సీపీ అధికారంలోనికి రావడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే నిమ్మల ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. మంగ రాజు వెంట మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి మై లాబత్తుల మైకేల్‌రాజు, పుచ్చకాయల శ్రీకాంత్, బీ రా సునీల్‌బాబు, బిరదా సందీప్, రోహిత్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment