వీడని ఎస్సై ఆత్మహత్య మిస్టరీ
తణుకు అర్బన్: తణుకు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం మిస్టరీగా మారింది. ఆ రోజు ఏం జరిగింది.. ముందు రోజు రాత్రంతా ఏం ఆలోచించారు.. సీ ఎం బందోబస్తులో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయాన్నే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మరీ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.. సీసీ పుటేజీ ప్ర కారం టాయిలెట్స్ ప్రాంతంలో ఎవరితో చాటింగ్ చేశారు.. ఒకవేళ పైఅధికారుల వేధింపులే అయితే ఆ అధికారి ఎవరనే ప్రశ్నలకు సమాధానం లేదు. ఎస్సై ఆత్మహత్యతో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. పోలీసుల పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం ఎస్సై భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు.
కీలకంగా ఎస్సై ఫోన్ : సంఘటన జరిగిన వెంటనే ఎస్సై ఫోన్‌ను స్వాధీనం చేసుకోమని రూరల్ స్టేషన్ సిబ్బందికి ఆదేశాలివ్వడం, నిబంధనల పేరుతో ఘటనా ప్రాంతాన్ని నిర్బంధించడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఘటన జరిగే ముందు ఎస్సై మూర్తి ఉపయోగించిన ఫోన్‌లో కీలక సమాచారం ఉందని బంధువులు, స్నేహితులు చెబుతున్నా.. పోలీసు అధికారులు ఫోన్ వ్యవహారాన్ని బయటపెట్టకపోవడం వెనుక కీలకమైన విషయం ఉందనే చర్చ నడుస్తోంది. ఫోన్‌లో ఉన్న మిస్టరీని పోలీసులు బహిరంగ పరిచి వేధింపులకు గురిచేసిన అధికారిని బయటపెడతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
గేదెల చోరీ సంఘటనే కారణమా..
గతేడాది నవంబరులో తణుకు మండలం వేల్పూరులో రెండు గేదెల చోరీ కేసుకు సంబంధించి తణుకు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సెటిల్‌మెంట్ వ్యవహారంలో ఎస్సై మూర్తి లేకపోయినా ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం, వీఆర్‌కు పంపడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక మరే కారణాలు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. పోలీసుల విచారణలో ఏమి తెలుస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గేదెల చోరీ కేసులో ఉన్నతాధికారులకు సైతం ఎస్సై మూర్తి భారీగా ముట్టజెప్పినట్టు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి.
విషయమంతా ఫోన్‌లోనే..!
వేధించిన ఉన్నతాధికారి ఎవరు ?
ఎస్సై ఆత్మహత్యపై అనుమానాలెన్నో..
Comments
Please login to add a commentAdd a comment