లోక్ అదాలత్‌తో సత్వర పరిష్కారం
ఏలూరు (టూటౌన్): కేసుల సత్వర పరిష్కారానికి కక్షిదారులు లోక్ అదాలత్ సేవలు వినియోగించుకోవాలని హైకోర్టు జడ్జి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథ రావు అన్నారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయసేవా సదన్‌లో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌పై కక్షిదారుల ఆలోచనా విధానంలో మార్పులు రావాలని, ఒకసారి పరిష్కారమైన కేసులను మరలా హైకోర్టులో ఫైల్ చేస్తున్నారన్నారు. లోక్ అదాలత్‌లపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కోర్టుల్లో శాశ్వత లోక్‌అదాలత్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసులో బీమా సంస్థ నుంచి రూ.26 లక్షల పరిహారం చె క్కును జస్టిస్ మన్మధరావు కక్షిదారులకు అందించా రు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్‌ఏసీ) ఎం.సునీల్‌కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్, రెండో అదనపు జిల్లా జడ్జి పి.మంగాకుమారి, పోక్సో స్పెషల్ జడ్జి ఎస్.ఉమా సునంద, ఐదో అదనపు జిల్లా జడ్జి జి.రాజేశ్వరి, 7వ అదనపు జిల్లా జడ్జి ఎం.రామకృష్ణంరాజు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కేకేవీ బులికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
5,368 కేసుల రాజీ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్‌లో 5,368 కేసులు రాజీ చేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. 155 సివిల్, 132 వాహన ప్రమాద బీమా, 4,919 క్రిమినల్, 132 ఫ్రీ లిటిగేషన్ కేసులు ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment