సూపర్ సిక్స్‌ను తుంగలో తొక్కిన కూటమి
వీరవాసరం: సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభు త్వం తుంగలో తొక్కిందని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ తీవ్రంగా ఆక్షేపించారు. నవుడూరు జంక్షన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై తప్పుడు అప్పుల ప్రచారంతో చంద్రబాబు గద్దెనెక్కారని విమర్శించారు. ఇప్పుడు శాసనసభలో ఆర్థిక మంత్రి గత ప్రభుత్వం చేసిన అప్పుల చిట్టాను విప్పడంతో ప్రజలందరికీ చంద్రబాబు చేసిన గోబెల్స్ ప్రచారం అర్థమైందన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ అధికారం అందుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, వీటిని ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన పార్టీ ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే అని గుర్తు చేశారు. కుల, మత, వర్గాలు, పార్టీలకు అతీతంగా మాజీ సీఎం జగన్ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించారన్నారు. గవర్నర్ ప్రసంగంలో సైతం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి ఆలోచన చేయడం దారుణమని దుయ్యబట్టారు. సంపద పెంచే మంత్రదండం ఏమీ లేదని చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కవురు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment