‘చింతలపూడి’ ఎండమావేనా?
చింతలపూడి: ప్రభుత్వ తీరు చూస్తుంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఇక ఎండమావే అనిపిస్తోంది. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం 16 ఏళ్ళు కావస్తున్నా కొలిక్కి రాలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాబార్డు నుంచి పథకానికి రూ.1931 కోట్ల రుణం మంజూరైంది.
కరోనా మహమ్మారి వల్ల పథకం పనులు ముందుకు సాగలేదు. మొదటి దశ పనులే పూర్తి కాని ఈ పథకానికి 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండో దశ మంజూరు చేసి భూసేకరణ చేపట్టడంతో అప్పట్లో రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. రెండో దశలో కృష్ణా జిల్లాలో మరో 2.80 లక్షల ఎకరాలను చేర్చి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.4,909.80 కోట్లకు పెంచారు. ఇందులో మొదటి దశ సామర్థ్యాన్ని పెంచడం వల్ల మరో రూ.808 కోట్లు అదనంగా ఖర్చవుతాయని అంచనా వేశారు. రెండో దశ పనులకు రూ.2,400 కోట్లు అంచనా కట్టారు. మొత్తం 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందే అవకాశం ఉంది. ప్రధాన కాలువ ద్వారా తొలుత 2 వేల క్యూసెక్కుల నీరు పారడానికి వీలుగా 24 మీటర్ల వెడల్పు, 3.2 మీటర్ల లోతు ఉండేలా తవ్వకం పనులు చేపట్టారు. సామర్థ్యం పెరగడంతో మరో మూడు మీటర్ల మేర కాల్వ ఎత్తు పెంచడానికి నిర్ణయించారు. కాల్వ ఎత్తు పెంచితే కాల్వపై కట్టే వంతెనలు, తూములు నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా డిజైన్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. జల్లేరు వద్ద తొలుత 8 టీఎంసీల సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్‌ను నిర్మించాలని భావించారు. అది 20 టీఎంసీల సామర్‌ాధ్యనికి పెంచారు. ఇప్పుడు ఈ రిజర్వాయర్ పనులను కూడ ప్రభుత్వం పక్కన పెట్టేసినట్లు సమాచారం.
పశ్చిమ రైతుల పట్ల వివక్ష
చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణలో అప్పటి ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా రైతుల పట్ల వివక్ష చూపింది. నష్ట పరిహారం పెంచాలని జిల్లాలోని రైతులు అనేక మార్లు ఆందోళనలు చేపట్టారు. వీరి అభ్యర్థనలను పెడచెవిన పెట్టిన ప్రభుత్వం కృష్ణా జిల్లా రైతులకు మాత్రం రెండో దశ పథకానికి ఎకరానికి 19 లక్షలు చెల్లించేలా జీఓ కూడా విడుదల చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూసేకరణకు ససేమిరా
జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల కాల్వ రైతులు నష్టపరిహారం విషయంలో సంతృప్తిగా లేరు. దీంతో రైతులు భూ సేకరణకు అడ్డు పడుతున్నారు. జిల్లాలోని పట్టిసీమ ప్రధాన కాల్వ కింద టీడీపీ ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.30 లక్షలు చెల్లించి, చింతలపూడి మండలంలో ఎకరానికి 12.50 లక్షలు ప్రకటించడం, కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలోని రైతులకు ఎకరానికి రూ.19 లక్షలు చెల్లిస్తామని ప్రకటించడంతో జిల్లా రైతులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాలకు ఒకే ప్యాకేజీ అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకం వల్ల ఎక్కువ ప్రయోజనం కృష్ణా జిల్లాకు కలుగుతుందని ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అవసరాలు తీరాకే కృష్ణా జిల్లాకు నీరు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
చింతలపూడి పథకం ప్రారంభించి దాదాపు 16 ఏళ్లు కావస్తుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తి కావస్తోంది. పథకం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. అధికారంలోకి వస్తే చింతలపూడికి నిధులు కేటాయించి పూర్తి చేస్తామని కూటమి నేతలు చెప్పారు. సప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో పదేళ్లకై నా పథకం పూర్తవుతుందా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
16 ఏళ్లయినా పూర్తికాని ఎత్తిపోతల పథకం
అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఊసే ఎత్తని కూటమి ప్రభుత్వం
ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి
రైతుల నష్ట పరిహారం సమస్యలను పరిష్కరించి వెంటనే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గడువులోగా పథకాన్ని పూర్తి చేసి మెట్ట రైతులకు సాగు నీరు, జిల్లా ప్రజలకు తాగునీరు అందచేయాలి.
– కంభం విజయరాజు– వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త
‘చింతలపూడి’ ఎండమావేనా?
‘చింతలపూడి’ ఎండమావేనా?
Comments
Please login to add a commentAdd a comment