మామిడిలో తెగుళ్ల బెడద
నూజివీడు: డివిజన్‌లో విస్తరించి ఉన్న మామిడి తోటలకు ఈ ఏడాది నల్ల తామర, బూడిద తెగుళ్లు సోకడంతో మామిడి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. నూజివీడు నియోజకవర్గంతో పాటు చింతలపూడి, లింగపాలెం మండలాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. పూతలు 80 నుంచి 90 శాతం తోటల్లో వచ్చినప్పటికీ నల్లతామర, బూడిద తెగుళ్ల వల్ల ఆశించిన స్థాయిలో పిందె కట్టు కనిపించడం లేదు. వాటి వల్ల పూతంతా నల్లగా మాడిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. బంగినపల్లి, తోతాపురి రకం తోటల్లో నల్లతామర ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త బొర్రా కనకమహాలక్ష్మి, శాస్త్రవేత్తలు కే రాధారాణి, శాలిరాజు నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు తదితర మండలాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితులపై రైతులకు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు.
నల్లతామర నివారణకు..
నల్లతామర పురుగుల నివారణకు రైతులు థయోమిథాక్సమ్ 25 శాతం 0.3 గ్రాములు లీటరు నీటికి లేదా స్పైనోసాడ్ 45 ఎస్‌సీ 0.3 ఎంఎల్ లీటరు నీటికి లేదా ఫిప్రోనిల్ 40 శాతం, ఇమిడాక్లోప్రిడ్ 40 శాతం 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడి తోటల్లో నల్ల తామర నివారణకు అక్కడక్కడ నీలిరంగు, పసుపురంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాటి ఉధృతి తగ్గించవచ్చన్నారు. నీలి, పసుపు, తెలుపు రంగు చీరలను మడ్డి ఆయిల్‌లో తడిపి తోటల్లో కడితే నల్ల తామర పురుగుల ఉధృతిని సులువుగా నివారించుకోవచ్చు. తోటల్లో అధికంగా పిందె రాలితే ప్లానోఫిక్స్ 0.2 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
బూడిద తెగులు నివారణకు..
బూడిద తెగులు నివారణకు హక్సాకోనజోల్ లేదా ప్రొపికోనజోల్ 2 ఎంఎల్ లేదా టెబుకొనజోల్, ట్రైఫ్లాక్సీట్రోబిన్ 1 గ్రాము పొడి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగులు అధికంగా ఉన్న తోటల్లో పూత నల్లగా మారడంతో పాటు పిందెలు అధికంగా రాలుతున్నట్లు గమనించినందున పిందెలు రాలకుండా తేలికపాటి నీటి తడులు ఇవ్వాలన్నారు. తోటలు శుభ్రంగా ఉంచుకున్న వాటిలో రసం పీల్చే పురుగులు, తెగుళ్ల ఉధృతి తక్కువగా ఉందన్నారు.
మాడిపోతున్న పూత
మామిడిలో తెగుళ్ల బెడద
మామిడిలో తెగుళ్ల బెడద
Comments
Please login to add a commentAdd a comment