పేదల వ్యతిరేక బడ్జెట్
భీమవరం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదల వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ శనివారం భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్‌లో వామపక్ష పార్టీల అధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరామ్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ రైతులకు ఆత్మహత్యలను పురుకొల్పేలా ఉందని మండిపడ్డారు. సామాన్యులు, కౌలు రైతు, కార్మిక, రైతు కూలీలను మోసం చేసే బడ్జెట్‌పై రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకుని పార్లమెంట్‌కు తిప్పి పంపాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేకమన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయడమేగాక ఉద్యోగం, ఉపాధికి నిధులు కేటాయించలేదని కోనాల విమర్శించారు. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వీ గోపాలన్, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు చినవెంకన్నను దర్శించారు. తెల్లవారుజామునుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లతో పాటు, అనివేటి మండపం, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట ఇలా అన్ని విభాగాలు భక్తులతో పోటెత్తాయి. ఉచిత అన్నప్రసాదం కోసం అన్నదాన భవనం వద్ద భక్తులు బారులు తీరారు. అలాగే పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో నిండిపోయాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.
కొట్లాట కేసు నమోదు
భీమవరం: భీమవరం పట్టణం మెంటేవారితోటలో ఇరువర్గాలు ఘర్షణ పడగా కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్సై బీవై కిరణ్‌కుమార్ శనివారం చెప్పారు. శుక్రవారం సాయంత్రం మెంటేవారితోటకు చెందిన ముత్యాలపల్లి సాయివంశీ అదే ప్రాంతానికి చెందిన కేశవరపు శివరమేష్ వర్గాలు కొట్టుకున్నాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరగా.. అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
పేదల వ్యతిరేక బడ్జెట్
Comments
Please login to add a commentAdd a comment