పంట కాల్వల్లో వైరస్ కోళ్లు
అత్తిలి: వైరస్ సోకి చనిపోయిన కోళ్లకు అత్తిలి కాలువ నిలయంగా మారింది. బర్డ్‌ప్లూ వ్యాధితో చనిపోయిన కోళ్లను నిబంధనల ప్రకారం పూడ్చిపెట్టాల్సి ఉండగా కొంతమంది పౌల్ట్రీ రైతులు చనిపోయిన కోళ్లను మూటలు కట్టి పంట కాలువలో పడేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకు వచ్చిన కోళ్ల మూటలు బ్రాంచ్ కాలువల స్లూయిజ్‌ల వద్ద అడ్డుపడి తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. వారం రోజుల క్రితం స్లూయిజ్‌ల వద్ద పేరుకుపోయిన కోళ్ల మూటలను ఆయా గ్రామాలలో స్థానిక నాయకులు కూలీలతో తొలగించినప్పటికీ, ఎగువ ప్రాంత నుంచి మూటలు కొట్టుకురావడంతో స్లూయిజ్ గేట్ల వద్ద గుట్టలుగా పేరుకుపోయాయి. చనిపోయిన కోళ్లతో పాటు జంతు కళేబరాలు కూడా కొట్టుకురావడంతో స్లూయిజ్‌ల వద్ద తాగునీరు కలుషితం అవుతోంది. అత్తిలి ప్రధాన కాలువ పరిధిలో రేలంగి చానల్, పాలి చానల్, పాలూరు చానల్, ఉరదాళ్లపాలెం చానల్, మంచిలి చానల్, ఈడూరు చానల్‌లో వైరస్ సోకి చనిపోయిన కోళ్ల మూటలు దర్శనమిస్తున్నాయి. మండల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చే అత్తిలి కాలువ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కలుషితమైన నీటిని తాగడం ద్వారా ప్రజలు అనేక రోగాలు బారిన పడే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు చనిపోయిన కోళ్లను కాలువలో వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ పౌల్ట్రీ రైతులు పట్టించుకోవడం లేదు. రాత్రి సమయంలో కోళ్ల ఫారాల యజమానులు కాలువలో పడేస్తున్నారు. కాలువను కలుషితం చేస్తున్న వారిపై నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అత్తిలి కాలువను కాలుష్యం బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారుల హెచ్చరికలు ఖాతరు చేయని పౌల్ట్రీ యజమానులు
Comments
Please login to add a commentAdd a comment