మెస్ నిర్వహణ సరిగా లేకపోతే జరిమానా
నూజివీడు: విద్యార్థులకు సరిపడా ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచకపోయినా, ఆలస్యమైనా మెస్ నిర్వాహకులకు జరిమానా విధిస్తామని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. స్థానిక ట్రిపుల్ ఐటీలో మెస్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కోడిగుడ్డు కూరకు బదులుగా క్యాలీఫ్లవర్ కూరను తయారు చేశారని.. మూడు వేల మంది విద్యార్థులకు కూరను సిద్ధం చేసినప్పటికీ సరైన అంచనా లేక 500 మంది విద్యార్థులకు తగ్గడంతో నిర్వాహకులు వెంటనే తయారు చేసి సకాలంలోనే అందించారన్నారు. అనుకోకుండా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా అధిగమించాలనే దానిపై కూడా చర్చించారు. మెస్ మానిటరింగ్ కమిటీ, ఫుడ్ క్వాలిటీ ఇన్‌చార్జి, మెస్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జిలు నిరంతరం మెస్‌లు పర్యవేక్షించాలన్నారు. నాణ్యత, పరిమాణంలో తేడా రాకుండా చూడాలన్నారు. సమావేశంలో ఏఓ బీ లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ చిరంజీవి, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ బ్రహ్మస్వాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment