వైద్యసేవ.. అవినీతి తోవ | - | Sakshi
Sakshi News home page

వైద్యసేవ.. అవినీతి తోవ

Published Sun, Feb 16 2025 12:24 AM | Last Updated on Sun, Feb 16 2025 12:22 AM

వైద్యసేవ.. అవినీతి తోవ

వైద్యసేవ.. అవినీతి తోవ

గతంలో ప్రతిష్టాత్మకంగా..

తణుకులోని ఆస్పత్రికి

రూ.3.10 లక్షల జరిమానా

ఉచిత వైద్య సేవ నిబంధనలు మీరి తమ నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ముగ్గురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై తణుకులోని ఒక ప్రైవేట్‌ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి రూ.3.02 లక్షల జరిమానాను ఉన్నతాధికారులు విధించారు. వీటిలో ఒక రోగి నుంచి రూ.10 వేలు వసూలు చేయగా అందుకు పది రెట్లు రూ.లక్ష, మరో రోగి నుంచి రూ.15,000 వసూలు చేసినందుకు గాను రూ.1.5 లక్షలు, మరో రోగి నుంచి రూ.5,200 వసూలు చేసినందుకు గాను రూ. 52,000 జరిమానాగా విధించారు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లులోని మరో ఐదు ఆస్పత్రుల్లో రోగుల నుంచి అక్రమ వసూళ్లపై ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టుకు ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. వీటిని మసిపూసి మారేడుకాయ చేసే పనిలో జిల్లాలోని సంబంధిత విభాగానికి చెందిన కొందరు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆస్పత్రులపై జరిమానాల విషయమై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి భానునాయక్‌ను సంప్రదించగా వాస్తవమేనని తెలిపారు.

సాక్షి, భీమవరం: ఉచిత వైద్యసేవలో పలు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చేతివాటం ప్రదర్శిస్తున్నాయి. రోగుల నుంచి అందినంత పిండుకుంటున్నాయి. ఆస్పత్రుల తీరుపై కొందరు ఉన్నతస్థాయికి ఫిర్యాదులు చేయడంతో జిల్లాలోని ఒక ఆస్పత్రికి రూ.3.02 లక్షల జురిమానా విధించగా మరికొన్నింటిపై విచారణ జరుగుతున్నట్టు తెలిసింది. ఇటీవల చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

జిల్లాలో 30 నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌

జిల్లాలో ఎన్టీఆర్‌ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) అందించే ప్రభుత్వ ఆస్పత్రులు 42 ఉండగా ప్రైవేట్‌ ఆస్పత్రులు 30 వరకు ఉన్నాయి. ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 22 మల్టీ స్పెషాలిటీ, ఎనిమిది డెంటల్‌ ఆస్పత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పేరును కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్‌ వైద్యసేవగా మార్చింది. ఈ పథకం కింద ఉచిత వైద్యసేవ పొందే రోగికి ఉచిత అడ్మిషన్‌, అవసరమైన వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలతో పాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే వరకు మందులు, రూమ్‌ సదుపాయం, అల్పాహారం, రెండు పూటలా భోజనం, వైద్యసేవలు అందించాలి. డిశ్చార్జ్‌ సమ యంలో రోగికి సరిపడా మందులు ఇవ్వాలి.

కొరవడిన అజమాయిషీ : ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం అమలులో సంబంధిత అధికారులు అజమాయిషి కొరవడటంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల ఇష్టా రాజ్యంగా మారింది. మత్తు ఇచ్చేందుకనో, అప్రూవల్‌ రావడానికి ఆలస్యమవుతుందనో, బయట కొన్ని వైద్య పరీక్షలు చేయించాలనో పలు కారణాలు చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రుల్లో రోగుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. డెలివరీలకు సైతం సొమ్ములు చెల్లించాలంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవల రోగుల నుంచి వసూలు చేసిన సొమ్ములకు రశీదులు సైతం ఇస్తుండటం గమనార్హం. అధిక శాతం మంది రోగులు ఎందుకొచ్చిన గొడవలే అన్నట్టుగా అడిగినంత చెల్లిస్తుండగా, కొందరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతున్నారు. ఆస్పత్రి యాజమాన్యాలతో తమకున్న పరిచయాలతో చాలా వరకు ఫిర్యాదులను జిల్లాస్థాయిలోని కొందరు అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధితులు వెనక్కి తగ్గకుండా నిలబడిన కేసుల్లో మాత్రం ఉన్నతస్థాయి నుంచి సంబంధిత ఆస్పత్రులపై చర్యలు తప్పనిసరి అవుతున్నాయి.

ప్రైవేట్‌ ఆస్పత్రుల ఇష్టారాజ్యం

ఉచిత సేవల్లో చేతివాటం

ఎన్టీఆర్‌ వైద్యసేవపై కొరవడిన అజమాయిషీ

రోగుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్న నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌

ఉన్నతస్థాయికి బాధితుల ఫిర్యాదు

జిల్లాలో పలు ఆస్పత్రులకు జరిమానాలు

గత ప్రభుత్వం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేసింది. క్యాన్సర్‌ వంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు పరిమితి లేకుండా అవసరమైన సాయం అందించారు. పథకం కింద అందించే 1,059 చికిత్సల సంఖ్య (ప్రొసీజర్ల)ను 3,257కి పెంచారు. శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకునే వరకు జీవనభృతి కోసం వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద ఆర్థిక సాయం కూడా అందించేవారు. ఇంటికి వెళ్లిన పది రోజుల తర్వాత ఆస్పత్రికి వచ్చి ఉచితంగా వైద్య సేవలు పొందే వీలు కల్పించారు. అవసరమైన చికిత్సలకు ఏడాది పాటు డాక్టర్‌ సంప్రదింపులు, వైద్య పరీక్షలు, మందులు కూడా ఉచితంగా ఇచ్చేవారు. అక్రమాల నివారణకు 14400 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసే వీలు కల్పించారు. అలాగే కుటుంబానికి రూ.5 లక్షలు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరింత భరోసా కల్పించారు. కాగా కూటమి ప్రభుత్వం ఆరోగ్య ఆసరాకు ఎసరు పెట్టింది. ఆస్పత్రులకు బకాయిల విడుదలలో జాప్యంతో ఉచిత వైద్య సేవల కోసం రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement