జంగారెడ్డిగూడెం: వివాహిత ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంకు చెందిన మహాలక్ష్మికి గుండుగొలనుకు చెందిన బొంతు నారాయణతో గత ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. మహాలక్ష్మికి ఇటీవల అబార్షన్ అయ్యింది. వారం రోజుల క్రితం మహాలక్ష్మి మైసన్నగూడెం పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆమె ఈ నెల 15న ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందింది. కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి చనిపోయి ఉందని, తల్లి నాగమణి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మైనర్లపై పోక్సో కేసు నమోదు
నూజివీడు: పట్టణంలోని అజరయ్యపేటకు చెందిన ఇద్దరు మైనర్లపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జ్యోతిబసు తెలిపారు. అజరయ్యపేటకు చెందిన బాలిక ఈ నెల 15న కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా ఇద్దరు యువకులు బండిపై వచ్చి ఇంటి దగ్గర దించుతామని అడగగా బండి ఎక్కింది. వారిద్దరూ బాలికను ఇంటి వద్ద దించకుండా శ్మశానం వైపు తీసుకెళ్లారు. అక్కడ చేతులు వేయబోగా కేకలు వేసింది. దీంతో యువకులు బాలికను బండిపై ఇంటి వద్ద దించారు. బాలిక విషయాన్ని తల్లితో చెప్పగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment