పరీక్షల వేళ ఆహార నియమాలు
చింతలపూడి: త్వరలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల వేళ విద్యార్థులు చదువు మీద ధ్యాసతో సరైన ఆహారం తీసుకోవడం మర్చిపోతారు. గంపెడు సిలబస్‌ను వడపోసి ప్రశ్నా పత్రాల్లో వచ్చే ప్రశ్నలకు జవాబులు రాయాలంటే ముందుగా విద్యార్థికి కావాల్సింది ఆరోగ్యం. ఈ నేపథ్యంలో పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు నెల రోజుల ముందునుంచే తేలికపాటి ఆహారం అందించడం ఉత్తమమని యర్రగుంటపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి కొత్తపల్లి నరేష్ తెలిపారు. రోజూ ఇంట్లో వండే వంటల్లోనే చిన్న, చిన్న మార్పులతో తేలికపాటి ఆహారాన్ని వండి పెట్టాలని సూచిస్తున్నారు.
ఏమేం తినాలి
● అధిక కారం, మసాలా, నూనెలతో తయారైన ఆహార పదార్థాలను తినకండి. వాటికి దూరంగా ఉండండి. రోజూ కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర పోవడం మంచిది. తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీ, రసంతో భోజనం మంచిది. పెరుగు, మజ్జిగ పరిమితంగా తీసుకోవాలి.
● అందుబాటులో ఉండే తాజా పండ్లు తీసుకోవాలి. ద్రాక్ష, అరటి పండు, అనాస, దోస వంటి పండ్లు ఆరోగ్యానికి మంచిది. పరీక్షలు జరిగే రోజుల్లో మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. మంచి ఆహారంతో పరీక్షల గండం గట్టెక్కినట్లే.
టైం టేబుల్
● మెదడు తాజాగా ఉండాలంటే పరీక్షల సమయంలో విద్యార్థులు ఉదయం 4.30 గంటలకు లేవడం రాత్రి 10.30 గంటలకు ముందుగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
● మెదడు చురుగ్గా పని చేయడానికి ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా చిక్కుడు, కూరగాయలు, పండ్లు తినాలి. ఉదయం లేచిన వెంటనే కొద్దిసేపు వ్యాయామం చేస్తే మంచిది. తరువాత ఇడ్లీ, పాలు తీసుకోవడం ఉత్తమం. అనంతరం చదువు ప్రారంభించాలి.
● పరీక్ష రాసి ఇంటికి వచ్చాక పండ్లు, పండ్ల రసాలు తాగాలి. పెరుగుతో ఆహారం తీసుకోవడం కూడా మంచిదే. సాయంత్రం చదువు ప్రారంభించేటప్పుడు కప్పు టీ తాగాలి. చదువడం అయిపోయాక నిద్రకు ఉపక్రమించే గంట ముందు తేలికపాటి భోజనం తీసుకోవాలి.
● ఒత్తిళ్లకు గురికాకుండా నిద్ర పోవాలి. రోజులో ఎక్కువ సార్లు పాలు తాగండి. మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఒకసారి రాస్తూ చదివితే పదిసార్లు చదివినట్లు అర్థం.
డాక్టర్ కొత్తపల్లి నరేష్, యర్రగుంటపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి
పరీక్షల వేళ ఆహార నియమాలు
Comments
Please login to add a commentAdd a comment