గల్లీ నుంచి ఢిల్లీకి
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని కేఆర్‌పురం ఐటీడీఏ వద్ద గిరిజన మహిళలు తయారు చేస్తున్న చిరుధాన్యాల మిల్లెట్ బిస్కెట్లు ఢిల్లీలో ఆదిమహోత్సవ్ కార్యక్రమంలో స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఏజెన్సీలో తయారీ చేసిననీ బిస్కెట్లు ఢిల్లీలో విక్రయించే అవకాశం రావడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కొందరు గిరిజన మహిళలు ఐటీడీఏ అధికారుల సహకారంతో చిరుధాన్యాలతో గిరి వనిత పేరుతో మిల్లెట్ బిస్కెట్లు తయారీ చేసి కేఆర్‌పురంలోనే విక్రయాలు ప్రారంభించారు. రాగులు, సజ్జలు, సోయా, పెసలు, అలసందలు, మినుములు, ఓట్స్, బెల్లంతో బిస్కెట్లు తయారు చేయడంతో అందరూ వీటిని తినేందుకు ఇష్టపడుతున్నారు. అనతి కాలంలోనే ఈ బిస్కెట్లకు గిరాకీ పెరగడంతో క్రమంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు షాపుల్లో ఈ బిస్కెట్లు విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కూడా బిస్కెట్లు విక్రయిస్తున్నారు. ఇటీవల టాటా గ్రూప్ కంపెనీ ముంబయిలో నిర్వహించిన సమావేశానికి వచ్చిన వారికి ఇచ్చిన గిఫ్ట్ ప్యాకెట్‌లో గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్‌లు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆదిమహోత్సవ్ (2025) కార్యక్రమంలో కూడా గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్ల స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు తయారు చేసిన వస్తువులు ప్రదర్శనగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానంతో మిల్లెట్ బిస్కెట్ల తయారు చేసే పొట్టోడి బుల్లమ్మకు అక్కడ విక్రయించే అవకాశం లభించింది. జీలుగుమిల్లి మండలంలో ఉన్న నిర్వాసిత గ్రామం కొరుటూరు నుంచి మరో ఇద్దరు ఐటీడీఏ ద్వారా ఢిల్లీలో స్టాల్స్‌ను ఏర్పాటు చేసి వారు తయారు చేసిన వస్తువులను విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని ఐటీడీఏల పరిధిలో ఎంపిక చేసిన వస్తువులు ఈ స్టాల్స్‌లో విక్రయిస్తున్నారు.
ఆదిమహోత్సవ్‌లో కేఆర్ పురం ఐటీడీఏ మిల్లెట్ బిస్కెట్ల స్టాల్
Comments
Please login to add a commentAdd a comment