మామిడి.. తడబడి
కొన్నేళ్లుగా గడ్డుకాలం
కొన్నేళ్లుగా మామిడికి గడ్డుకాలం నెలకొంది. పూత వచ్చినా దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడం, దిగుబడి ఉన్నా మార్కెట్‌లో సరైన ధర లభించకపోవడం తదితర కారణాలతో రైతులు నష్టపోతున్నారు. తోటల దుక్కి, ఎరువులు, పురుగు మందులకు పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి రైతులకు ఎదురవుతోంది. అలాగే ముదురు తోటలు కావడంతో ఎంత పెట్టుబడి పెట్టినా కాయకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. దీంతో భూములున్నా ఆదాయం లేక అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏడాదికి 4 వేల ఎకరాలు కనుమరుగు
ఏడాదికి నూజివీడు డివిజన్‌లో కనీసం 4 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలను నరికివేస్తున్నారు. పేపర్ తయారీకి మామిడి కలపను వినియోగిస్తుండటంతో ఈ ప్రాంతంలోని ముదురు మామిడి తోటలకు గిరాకీ పెరిగింది. నరికిన తోటల్లో సగం తోటల వరకు మామిడి మొక్కలు వేస్తుండగా, మిగిలిన సగం మాత్రం ఆయిల్‌పామ్, ఇతర పంటలు సాగుచేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మామిడి కనుమరుగయ్యే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.
నూజివీడు: మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన నూజివీడు డివిజన్‌లో ఏటేటా తోటల విస్తీర్ణం తగ్గిపోతోంది. పురుగులు, తెగుళ్లు బెడద ఎక్కువవ్వడం, గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు వెరసి మామిడి రైతులు ప్రతి ఏటా నష్టాల బాటలోనే పయనిస్తున్నాడు. మామిడి తోట ల ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో వాటిని నరికివేస్తున్నారు. ఈ భూముల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటుతున్నారు. మరికొందరు మొక్కజొన్న, పత్తి, మిరప,పొగాకు వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేసి గ్యారంటీ ఆదాయం పొందుతున్నారు. ఆయిల్‌పామ్ మొక్క లు నాటినా ఐదేళ్ల వరకు అంతర పంటలుగా మొక్కజొన్న, కూరగాయలు, పుచ్చ, మిర్చి, పత్తి తదితర పంటలను సాగు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా మామిడిపై వచ్చే ఆదాయం క్రమేణా తగ్గుతోంది. ప్రతికూల వాతావరణం వల్ల పూతలు రాకపోవడం, వచ్చినా నిలవకపోవడం, వచ్చిన పూతలను రక్షించుకునేందుకు 12 నుంచి 15 సార్లు రసాయన మందులు పిచికారీ చేయడం, రెండేళ్లుగా నల్ల తామర పురుగుల ఉధృతి ఎక్కువ కావడం, పూర్తిగా మామిడి దిగుబడి పడిపోవడం తదితర కారణాలతో రైతులు ఆలోచనలో పడ్డారు. ఈ ప్రాంతంలో శతాబ్దాల తరబడి సాగులో ఉన్న మామిడి తోటలను తొలగించడానికి ఇష్టం లేకున్నా ఆదాయం రాకపోవడంతో చేసేదేమీ లేక తోటలను నరికి వేస్తున్నారు.
ఇతర ప్రాంతాల్లో పెరిగిన విస్తీర్ణం
ఒకప్పుడు మామిడి అంటే నూజివీడు ప్రాంతమే కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలతో పాటు పక్కనే ఉన్న తెలంగాణలో సైతం మామిడి తోటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో వ్యాపారస్తులు, హైదరాబాద్, గుజరాత్, బరోడా వంటి ప్రాంతాలకు చెందిన మామిడి సేట్‌లు కాయలను కొనుగోలు చేసేందుకు నూజివీడుకు కాకుండా ఇతర ప్రాంతాలకు సైతం వెళ్తున్నారు. ఒకప్పుడు మామిడి మార్కెట్‌లలోని కమీషన్ వ్యాపారస్తులే మామిడి వ్యాపారస్తులకు పెట్టుబడులు ఇచ్చి తోటలను కొనుగోలు చేయించేవారు. వారి వద్ద నుంచి కమీషన్ వ్యాపారస్తులు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.
మామిడి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటైతేనే..
నూజివీడు ప్రాంతంలో బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలు, పెద్ద రసాలు వంటి రకాలను రైతులు సాగుచేస్తారు. వీటిలో అగ్రభాగం బంగినపల్లి రకం కాగా ఆ తర్వాత తోతాపురి ఉంటుంది. మామిడి తోటలు దాదాపు 40 వేల ఎకరాల్లో ఉన్నా మామిడి ఆధారిత పరిశ్రమలు ఇక్కడ లేవు. చిత్తూరు జిల్లాలో దాదాపు 60 వరకు జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దీంతో ఆ జిల్లాలోని దిగుబడితో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కూడా తోతాపురి రకం కా యలు అక్కడి జ్యూస్ ఫ్యాక్టరీలకు వ్యాపారస్తులు ఎగుమతి చేస్తారు. మామిడి రైతులకు ప్రభుత్వం నుంచి చేయూత కరువు కాగా ఒకప్పుడు మామిడికి పేరెన్నికగన్న నూజివీడు ప్రాంతం ప్రాధాన్యతను కోల్పోతోంది.
చేయూత కరువై.. సాగు భారమై..
మామిడి తోటలను నరికివేస్తున్న రైతులు
తగ్గుతోన్న తోటల విస్తీర్ణం
ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి
తోట తొలగించి ఆయిల్‌పామ్ మొక్కలు వేశా..
మామిడి తోటలు కాపు కాసినా ధర లేక పెట్టుబడులు రాకపోవడం, గాలిదుమ్ములు వచ్చినప్పుడు కాయలు రాలిపోయి నష్టాలు రావడం, పూత వచ్చినా పురుగులు, తెగుళ్ల వల్ల పిందె ఏర్పడకపోవడం వంటి కారణాలతో నష్టాలు వచ్చాయి. దీంతో నాలుగెకరాల్లో మామిడి తోట నరికి వేయించి ఆయిల్‌పామ్ మొక్కలు వేశా. ఐదేళ్ల వరకూ అందులో అంతర పంటలను సాగు చేసుకోవచ్చు.
– పల్లె రవీంద్రరెడ్డి, తూర్పు దిగవల్లి, నూజివీడు మండలం
మామిడి.. తడబడి
మామిడి.. తడబడి
Comments
Please login to add a commentAdd a comment