క్లాప్‌నకు మంగళం
భీమవరం(ప్రకాశం చౌక్) : పట్టణాల పరిశుభ్రతే లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని అమలు చేసింది. ఇంటింటా చెత్త సేకరణకు ప్రత్యేక బ్యాటరీ వాహనాలను సమకూర్చింది. ఈ వాహనాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వార్డుల్లో ఇంటింటా తిరుగుతూ తడి, పొత్త చెత్తలను వేర్వేరుగా సేకరించేవి. ఇలా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు 149 వాహనాలను ప్రభుత్వం కేటాయించింది. వీటి ద్వారా రోజుకు 300 టన్నుల చెత్తను సేకరించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లాప్ కార్యక్రమాన్ని నిలిపివేసింది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో క్లాప్ ఆటోలు మూలకు చేరాయి. జిల్లాలోని పాలకొల్లు మున్సిపాలిటీలో మినహా మిగిలిన ప్రాంతాల్లో క్లాప్ అమలుకావడం లేదు.
కూటమి చరమగీతం
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లాప్ కార్యక్రమానికి చరమగీతం పాడేశారు. దీంతో వాహనాలు నిరుపయోగంగా మారాయి. జిల్లాలోని భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో మూడు నెలలుగా క్లాప్ వాహనాల ద్వారా చెత్త సేకరణ నిలిపివేశారు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు వాహనాల కొరత ఏర్పడి ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమంటూ ఉపన్యాసాలు ఇచ్చే సీఎం చంద్రబాబు పట్టణాల్లో చెత్త సేకరణ వాహనాలపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం. గత ప్రభుత్వంలో క్లాప్ కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు వచ్చాయి. పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని గాలికి వదిలేయడంతో రూ.5 లక్షల చొప్పున విలువ చేసే వాహనాలు దెబ్బతింటున్నాయి. క్యాబిన్‌లు తుప్పుపట్టడం, ఇంజన్లు పాడవటం వంటివి జరుగుతున్నాయి.
కార్మికుల ఉపాధికి దెబ్బ
జిల్లాలో మున్సిపాలిటీల వారీగా భీమవరంలో 41, తాడేపల్లిగూడెంలో 40, పాలకొల్లులో 23, నరసాపురంలో 17, తణుకులో 28 క్లాప్ వాహనాలు పనిచేసేవి. రోజుకు సుమారు ఒక్కో వాహనం 30 కిలోమీటర్ల మేర తిరుగుతూ రెండు నుంచి మూడు టన్నుల చెత్త సేకరించేవి. మొత్తంగా 149 వాహనాలకు 149 మంది డ్రైవర్లు, ఐదుగురు సూపర్‌వైజర్లు ఉపాధి పొందేవారు. డ్రైవర్‌కు రూ.11 వేలు, సూపర్‌వైజర్‌కు రూ.15 వేల చొప్పున గత ప్రభుత్వం ఏజెన్సీ ద్వారా వీరికి జీతాలు అందించింది. ప్రస్తుతం పాలకొల్లులోని 23 వాహనాల్లో 19 మాత్రమే నడుస్తున్నాయి. క్లాప్ నిలిపివేయడంతో జిల్లాలో సుమారు 134 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. తమను విధుల్లో కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
‘చెత్త’శుద్ధి కరువాయే!
మూలకు చేరిన క్లాప్ ఆటోలు
ఇంటింటా చెత్త సేకరణ నిలుపుదల
గత ప్రభుత్వంలో జిల్లాకు 149 వాహనాల కేటాయింపు
రోజుకు 300 టన్నుల చెత్త సేకరణ
కూటమి పాలనలో ఎక్కడి చెత్త అక్కడే
ఇదేనా ‘స్వచ్ఛ ఆంధ్ర’ ?
కూటమి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర..స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. క్లాప్ ఆటోలు మూలకు చేరడం, మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ వాహనాల కొరతతో చెత్త సేకరణ అధ్వానంగా మారింది. దీంతో పట్ట ణాల్లోని రోడ్డు మార్జిన్లు డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ వాహనాలు భీమవరంలో 20కి 12, నరసాపురంలో 15కు 8, పాలకొల్లులో 10కి 6, తణుకులో 20కి 14, తాడేపల్లిగూడెంలో 20కి 14 మాత్రమే పనిచేస్తున్నాయి. పారిశుద్ధ్యం మెరుగులో కీలక పాత్ర పోషించిన క్లాప్ ఆటోలు లేకపోవడంతో ఇంటింటా చెత్త సేకరణ అంతంతమాత్రంగానే జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ దివస్ ఎలా సాధ్యమవుతుందని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు.
క్లాప్‌నకు మంగళం
Comments
Please login to add a commentAdd a comment