
ఇప్ప పువ్వు.. గిరిజనుల కల్పతరువు
బుట్టాయగూడెం: ఆదివాసీ గిరిపుత్రులకు అడవిలో లభించే ఉత్పత్తులే జీవనాధారం. అందులోనూ కాలానుగుణంగా లభించే ఇప్ప పవ్వు అతి ప్రధానమైనది. వేసవిలో మాత్రమే దొరికే వీటిని విక్రయించి గిరిజనులు ఉపాధి పొందుతుంటారు. తెల్లవారుజామునే అడవిలోకి వెళ్లి ఇప్పపువ్వును గిరిజనులు సేకరిస్తారు. చెట్లపై నుంచి కిందపడిన ఇప్ప పువ్వును మధ్యాహ్ననికి సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడతారు.
మూడు నెలల పాటు ఉపాధి
మన్య ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు ఇప్ప చెట్ల ద్వారా మూడు నెలల పాటు ఉపాధి దొరుకుతుంది. ఖరీఫ్, రబీ పనులు ముగిసే సమయానికి ఇప్ప చెట్లు విరగ పూస్తాయి. వీటి పువ్వులు గాలికి నేలరాలుతుంటాయి. ఈ పువ్వులను గిరిజనులు సేకరిస్తారు. వీటితోపాటు మొర్రి పండ్లు సేకరించి ఇంటికి తీసుకువస్తుంటారు. వీటిని సేకరించి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విక్రయించి ఉపాధి పొందుతుంటారు.
ఔషధాల తయారీ
గిరిజనులు సేకరించిన ఇప్ప పువ్వును జీసీసీల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఇప్ప పువ్వును ఔషధాల తయారీకి విక్రయిస్తారు. ఈ పువ్వు నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. అలాగే దంతాలను శుభ్రం చేసుకోవడంతోపాటు దగ్గుకు, దంతాలకు సంబంధించిన వ్యాధులకు ఔషదంగా పనిచేస్తుంది. ప్రధానంగా స్వచ్ఛమైన ఇప్ప పువ్వుతో తయారు చేసిన సారాను సేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని గిరిజనులు అంటున్నారు. వైద్యశాస్త్రంలోనూ ఇప్ప పువ్వు ప్రాధాన్యతను సంపాదించుకుంది. ఆయుర్వేదంలోనూ మధుక వృక్షం అని పేరుపొందింది. గిరిజన ప్రాంతంలోని ప్రజలు ఈ ఇప్పచెట్లను మాతృమూర్తిగా భావిస్తారు.
ఇప్ప పువ్వులో ఎన్నో పోషకాలు
అడవిలో లభించే ఇప్ప పువ్వుల గింజల నుంచి తీసిన నూనెలో ఎన్నో పోషక విలువలున్నట్లు శాసీ్త్రయంగా నిరూపించబడింది. భారత శాసీ్త్రయ సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయంతో 1999లో నిర్వహించిన పరిశోధనలో ఎండిన ఇప్ప పువ్వుల నుంచి పంచదారను తయారు చేసి దీనితో జామ్, కేక్‌లు, చాక్లెట్‌లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. ఇప్పపువ్వు ఎక్కువకాలం నిల్వ ఉండడానికి మధ్యమధ్యలో ఎండిన వేప ఆకును వేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుందని తెలుసుకున్నారు. కొందరు గిరిజనులు ఇప్పపువ్వును ఆహారంగా కూడా తీసుకుంటారు.
ధరలేక ఇప్ప పువ్వు సేకరణపై తగ్గిన ఆసక్తి
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంతో పాటు పాపికొండల అభయారణ్యంలో ఇప్ప చెట్లు దాదాపుగా 10 వేలకు పైగా ఉండవచ్చని అంచనా. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈ ఇప్ప చెట్లు ఆధికంగా ఉన్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 5 వేల చెట్ల వరకూ అటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో నాటి వాటిని పెంచుతున్నారు. గిరిజనులు సేకరించిన ఈ ఇప్ప పువ్వులను జీసీసీ అధికారులే కాదు బయటి నుంచి అనేక మంది వ్యాపారులు కూడా కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. ప్రస్తుతం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గుత్తుకోయలు, బుట్టాయగూడెం మండలంలో కొండరెడ్లు ఈ పువ్వులను సేకరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే సరైన ధర లభించకపోవడంతో కాలక్రమేపీ గిరిజనులు కూడా ఇప్ప పువ్వు సేకరణపై ఆసక్తి చూపడంలేదు. అలాగే పలుచోట్ల ఇప్ప పువ్వు చెట్లను కూడా నరికివేస్తున్నట్లు సమాచారం.
పోషకాలు పుష్కలం.. వైద్య శాస్త్రంలోనూ ప్రాధాన్యత
వేసవి నుంచి మూడు నెలల పాటు అడవి బిడ్డలకు ఉపాధి
గిట్టుబాటు ధర లేక.. తగ్గుతున్న పువ్వుల సేకరణ
జీసీసీ ద్వారా ఇప్ప పువ్వుకొనుగోలు చేయాలని డిమాండ్
సరైన ధర లేక..
సరైన ధర రాకపోవడంతో గిరిజనులు ఇప్ప పువ్వుల సేకరణకు ఆసక్తి చూపడంలేదు. రానురానూ చెట్లు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో చెట్లను పెంచడంతోపాటు జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి.
– కారం రాఘవ, న్యూడెమోక్రసీ నాయకులు, అలివేరు
జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి
మా గ్రామ సమీపంలోని అడవుల్లో ఇప్ప పువ్వుతోపాటు పలు ఉత్పత్తులు లభిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్ప పువ్వు సీజన్ ప్రారంభమవుతుంది. జీసీసీ ద్వారా ఇప్ప పువ్వు కొనుగోలు చేయాలి.
– కెచ్చెల బాలిరెడ్డి, కొండరెడ్డి గిరిజనుడు, మోదేలు

ఇప్ప పువ్వు.. గిరిజనుల కల్పతరువు

ఇప్ప పువ్వు.. గిరిజనుల కల్పతరువు

ఇప్ప పువ్వు.. గిరిజనుల కల్పతరువు
Comments
Please login to add a commentAdd a comment