
సూరీడు.. అప్పుడే సుర్రుమంటున్నాడు
నరసాపురం: ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే ఎండలు అదరగొడుతున్నాయి. సూరీడు సుర్రుమంటూ రానున్న రోజుల్లో తన ప్రతాపం ఎలా ఉండబోతుందోననే హింట్ ఇస్తున్నట్టుగా ఉంది. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో గత వారం రోజుల నుంచి 40 డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా ఫిబ్రవరి మాసం ద్వితీయార్థంలో ఉన్నాము. సాధారణంగా మార్చి చివరివారం నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వేసవి తాలూకూ ప్రభావం కనిపిస్తోంది. మొన్నటి వరకూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కూడా జిల్లాల్లో మంచు ప్రభావం చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నప్పటికీ, ఉదయం పూట ఉష్ణోగ్రతలు మాత్రం పెరిగాయి. దీనిని బట్టి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎంత పెద్దస్థాయిలో ఉంటాయో? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గాలిలో ఉండే తేమశాతంలో కూడా భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా ఉక్కబోత ప్రజలను కాస్త ఇబ్బంది పెడుతుంది.
తగ్గుతున్న తేమశాతం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
సాధారణంగా పగటి పూటల్లో గాలిలో తేమశాతం 50 శాతం పైనే నమోదవుతుంది. తెల్లవారుజామున 95 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గాలిలో తేమశాతం పడిపోతోంది. పగటిపూట 40 నుంచి 50 శాతం, తెల్లవారుజాము సమయంలో 85 నుంచి 90 శాతంగా గత 10 రోజులుగా నమోదవుతోంది. ఇక ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. గత 10 రోజులుగా ఉమ్మడి పశ్చిమలో అత్యధికంగా 38 నుంచి 41 డిగ్రీలు, అత్యల్పంగా 32 నుంచి 37 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే, ఈ సంవత్సరం వేసవి మొత్తం భానుడు తన ప్రతాపాన్ని గట్టిగానే చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు
మొన్నటి వరకూ శీతాకాలం. ఇప్పుడు చలిగాలులు తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ధీర్ఘకాల రోగాలకు మందులు తీసుకుంటున్న వారు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
వేసవి ప్రారంభంలోనే హెచ్చరికలు జారీ చేస్తున్న ఎండలు
ఉమ్మడి జిల్లాలో 40 డిగ్రీల చేరువలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
తేమశాతంలో భారీ హెచ్చుతగ్గులు
ఉక్కబోతలు కూడా ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment