
వర్గీకరణ చేస్తే ప్రాణత్యాగాలకు సిద్ధం
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ దేశ వ్యాప్తంగా చేయాలి తప్పా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగు రాష్ట్రాల పరిధిలో చేస్తే ప్రాణత్యాగాలు చేయడానికి కూడా సిద్ధమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటమిల్లి మంగరాజు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని హౌసింగ్ బోర్డులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రావడానికి మాలలే ప్రముఖ పాత్ర వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మాలలు కృషి చేస్తే అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంద కృష్ణకు అనుకూలంగా ఎస్సీ వర్గీకరణ చేసేందుకు చూస్తున్నారని, ఇది సరికాదన్నారు. మందకృష్ణ మాత్రం మతతత్వ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని, ఈ విషయాన్ని ఇతర పక్షాలు గుర్తించాలని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య, ఏపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పుష్పాంజలి, మహానంది, శేషు పాల్గొన్నారు.
గ్యాస్ లీకై వ్యక్తికి తీవ్ర గాయాలు
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం కనకాపురంలో సోమవారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పైప్ లీక్ అయ్యి మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన బంగారయ్య వంట కోసం గ్యాస్ స్టౌను వెలిగించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో గ్యాస్ పైప్ లీక్ అవ్వడంతో మంటలు చెలరేగి అతనికి తీవ్ర గాయాలయ్యాయి. బంగారయ్యను చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా మంటలు ఆర్పేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా గ్యాస్ సిలిండర్ కావడంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఎస్సై నవీన్‌కుమార్ అక్కడికి చేరుకుని ఆ మంటలను ఆర్పించారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం రూరల్: లారీ ఢీకొని మోటార్‌సైక్లిస్టు మృతి చెందాడు. రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపిన వివరాలివి. ముత్యాలంబాపురం గ్రామానికి చెందిన పప్పు సంజీవరావు (64) సోమవారం తన మోటారు సైకిల్‌పై దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వెళ్లి తిరిగి వస్తుండగా పెదతాడేపల్లి జాతీయ రహదారిపై ఏపీ 28 టిడి 5445 నెంబరు గల లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడ్ని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై సంజీవరావు కుమారుడు అశోక్ కుమార్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
సారా తయారీదారుల అరెస్ట్
చాట్రాయి: సారా తయారీదారులను అరెస్ట్ చేసినట్లు నూజివీడు ఎకై ్సజ్ ఎస్సై మస్తానరావు తెలిపారు. మండలంలోని పోతనపల్లి తండాలో సారా నేరాలకు పాల్పడుతున్న హసావతు బాలరాజు, వడిత్యా బిక్షాలు, ధారావతు శ్రీరాములును అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం తిరువూరు కోర్టుకు తరలించినట్లు సోమవారం ఆయన చెప్పారు.

వర్గీకరణ చేస్తే ప్రాణత్యాగాలకు సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment