
నేను చెప్పినట్టు నడుచుకోవాల్సిందే!
నూజివీడు: రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ఎంతో కొంత మెరుగ్గా ఉన్న నూజివీడు ట్రిపుల్ ఐటీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బోధనేతర ఉద్యోగి వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రానురాను అతని తీరు ట్రిపుల్ ఐటీ అధికారులను సైతం ఇబ్బంది పెట్టేలా పరిణమించడం గమనార్హం. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనకు చెప్పాలని, నేను చెప్పినట్లే అందరూ నడుచుకోవాలంటూ డైరెక్టర్, ఏవోలకు సైతం హుకుం జారీ చేస్తుండటంతో మిగిలిన ఉద్యోగులందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇన్‌చార్జి బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి, ఎవరిని తొలగించాలో కూడా తానే చెప్తానంటూ తన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. తనకు ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్ ఇవ్వాలని, సెంట్రల్ డీన్ హోదా ఇవ్వాలని, తన డిజిగ్నేషన్ మార్చాలని, జీతం పెంచాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. అంతేగాకుండా తనకు లోకేష్ తెలుసని, లోకేష్ టీం తెలుసంటూ ట్రిపుల్ ఐటీలోని అధికారులను బెదిరిస్తూ కర్రపెత్తనం చేస్తుండటం, తనకు నచ్చని వారికి అదనపు బాధ్యతలు ఇస్తే వారిని ఆ బాధ్యతల నుంచి తొలగించాలంటూ ఒత్తిడి చేయడం నిత్యకృత్యంగా మారిందనే ప్రచారం జరుగుతోంది.
విద్యార్థులపైనా వేధింపులు
ఒకవైపు అధికారులపై కర్ర పెత్తనం చేస్తుండటంతో పాటు తమకు నచ్చని విద్యార్థులపైనా వేధింపులు చేస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా విద్యార్థులు తమకు నచ్చిన హీరో ఫొటోనో, నాయకుడి ఫొటోనో ఫోన్‌లస్టాటస్‌గా పెట్టుకుంటే ఆ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తుండటంపై ట్రిపుల్ ఐటీలో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ట్రిపుల్ ఐటీలను స్థాపించి 16 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని పలువురు వాపోతున్నారు. ఈ ఉద్యోగితో పాటు కొందరు ప్రభుత్వ అనుకూల వర్గంగా ఏర్పడి తమకు అనుకూలంగా లేని ఉద్యోగులపై ఫిర్యాదులు సైతం చేస్తుండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో బయటి నుంచి కనబడే శత్రువు కంటే మనలోని కనబడని శత్రువు నుంచే ట్రిపుల్ ఐటీలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయంటూ ఒక అధికారి పేర్కొన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఇంతకీ ఆ బోధనేతర ఉద్యోగి కాంట్రాక్టు ఉద్యోగి కావడం కొసమెరుపు.
కర్ర పెత్తనం చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి
లోకేష్ టీం పేరుతో బెదిరింపులు
ట్రిపుల్ ఐటీలో అధికారులపై ఒత్తిడి
విద్యార్థులపై లేనిపోని ఫిర్యాదులు
వివాదాస్పదంగా బోధనేతర ఉద్యోగి తీరు
Comments
Please login to add a commentAdd a comment