
కొత్త ‘మోడల్’తో బడికి మూత
తణుకు రూరల్ మండపాక ఎస్సీ కాలనీలోని ఎంపీపీ పాఠశాల–3కు 95 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామానికి చెందిన ఎంతోమంది విద్యావేత్తలు, ఉద్యోగులు, ప్రముఖులు ఓనమాలు దిద్దింది ఇక్కడే. ప్రస్తుతం ఈ పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్ (ఎంపీఎస్) కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో ఈ పాఠశాలలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను సుమారు రెండు కి.మీ దూరంలోని పాఠశాలలో విలీనం చేసేందుకు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఇక్కడ 1, 2 తరగతులకు చెందిన కొద్దిమంది విద్యార్థులు మాత్రమే మిగులుతారు. వారి కోసం ఈ పాఠశాలను కొనసాగిస్తారా? లేక.. విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న కారణంతో భవిష్యత్తులో మూసివేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
●
విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుంది
మండపాక ఎంపీపీ–3 పాఠశాలకు 95 ఏళ్ల చరిత్ర ఉంది. ఎంపీఎస్ పేరిట ఇక్కడి 3, 4, 5 తరగతులను రెండు కి.మీ దూరంలోని వేరే పాఠశాలలో విలీనం చేయడం సరికాదు. దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది.
– జంగం సురేష్ బాబు, ప్రైవేట్ టీచర్, మండపాక
మూసేయాలని చూస్తే ఉపేక్షించం
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే నిర్ణయాలను స్వాగతిస్తాం. మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు పేరిట కొన్ని పాఠశాలలను మూసేయాలని చూస్తే ఉపేక్షించేది లేదు. విద్యార్థులకు న్యాయం జరిగేలా వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తాం.
– ఎల్.సాయి శ్రీనివాస్, ఎస్‌టీయూ, రాష్ట్ర అధ్యక్షుడు, భీమవరం
సాక్షి, భీమవరం: మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరిట బడుల సంఖ్యను తగ్గించే దిశగా కూటమి సర్కారు ఎత్తుగడలు వేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నూతన విధానం అమలుకు కసరత్తు చేస్తోంది. జిల్లాలోని 409 పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లోని 143 వార్డుల పరిధిలో మొత్తం 1,436 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1, 2 తరగతులు కలిగిన ఫౌండేషన్ స్కూళ్లు(ఎఫ్‌ఎస్) 96 ఉండగా, 1 నుంచి 5వ తరగతి వరకు ఫౌండేషన్ ప్రైమరీ స్కూళ్లు(ఎఫ్‌పీఎస్) 1025 ఉన్నాయి. 1 నుంచి 7, 8వ తరగతి వరకు ప్రైమరీ హైస్కూళ్లు (పీహెచ్‌ఎస్) 43 ఉండగా, 3 నుంచి 10వ తరగతి వరకు హైస్కూళ్లు (హెచ్‌ఎస్) 43, 6 నుంచి 10వ తరగతి వరకు హైస్కూళ్లు (హెచ్‌ఎస్)144 ఉన్నాయి. జూనియర్ ఇంటర్ కలిగిన హైస్కూళ్లు (హెచ్‌ఎస్ ఫ్లస్) 20, ఎయిడెడ్/సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు 36 ఉన్నాయి.
మోడల్ స్కూళ్లకు ప్రతిపాదనలు
రానున్న విద్యాసంవత్సరం నుంచి గ్రామాల్లో కిలోమీటరు పరిధిలోని ఫౌండేషన్ ప్రైమరీ స్కూళ్ల పాఠశాలలను విలీనం చేసి ఎంపీఎస్‌ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మోడరన్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుకు 60 మంది విద్యార్థులు ఉండాలి. ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు గతంలోనే మార్గదర్శకాలిచ్చింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పిస్తారు. ఈ మేరకు గత డిసెంబరు 31 తేదీ నాటికి విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా 25 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలను గుర్తిస్తున్నారు. విలీనమయ్యాక ఎఫ్‌పీఎస్‌లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో కేవలం 1, 2 విద్యార్థులకు సంబంధించిన ఫౌండేషన్ స్కూళ్లుగా అవి మారుతాయి. విద్యార్థుల సంఖ్య సరిపడనంత ఉన్న మిగిలిన పాఠశాలలను బేసిక్ ప్రైమరీ స్కూల్స్ (బీపీఎస్)గా గుర్తిస్తారు.
జిల్లాలో 311 మోడల్ స్కూళ్లు
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇప్పటికే జిల్లాలో విలీన ప్రతిపాదిత పాఠశాలలను గుర్తించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. దీని ప్రకారం జిల్లాలో 12 పాఠశాలలను యూపీఎస్‌లుగా కొనసాగించనుండగా, 311 మోడల్ ప్రైమరీ స్కూళ్లు (1–5వ తరగతి) ఏర్పాటు కానున్నాయి. 424 బీపీఎస్‌లు(1–5వ తరగతి), 424 ఎఫ్‌ఎస్ (1–2వ తరగతి), 230 హెచ్‌ఎస్‌లు (6–10వ తరగతి)లు ఏర్పాటుకానుండగా సోషల్, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు యథావిధిగా ఉంటాయి.
తాజా నిర్ణయం వలన కొన్ని ఫౌండేషన్, బీపీఎస్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీనిని సాకుగా చూపించి కూటమి ప్రభుత్వం ఆయా పాఠశాలలను ఎత్తివేసే ఆలోచన చేయవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానంలో ఉపాధ్యాయులు మిగలడం వల్ల డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఖాళీ పోస్టులు తగ్గవచ్చన్న అభిప్రాయం ఉంది. ఇవి ప్రాథమిక అంచనా మాత్రమేనని తుది నివేదిక సిద్ధం కావాల్సి ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
మండపాకలోని ఎంపీపీ పాఠశాల
ప్రభుత్వ బడులను తగ్గించే ఎత్తుగడ
వచ్చే విద్యాసంవత్సరం నుంచి నూతన విధానం అమలుకు కసరత్తు
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న విద్యా శాఖ
జిల్లాలో అనేక పాఠశాలలు మూతపడే అవకాశం
నాడు.. నాడు–నేడుతో మహర్దశ
పేదల విద్యకు పెద్దపీట వేసిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చారు. మన బడి నాడు–నేడుతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఊపిరిలూదారు. రూ. 369.11 కోట్ల వ్యయంతో డిజిటల్ క్లాస్‌రూంలు, తాగునీటి వసతి, టాయిలెట్స్, కిచెన్ షెడ్లు, ప్రహరీగోడలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, విద్యుద్దీకరణ, మేజర్, మైనర్ మరమ్మతులు తదితర అభివృద్ధి పనులు చేశారు. ఈ విద్యాసంవత్సరంలో తల్లికి వందనంకు కూటమి ప్రభుత్వం ఎగనామం పెట్టింది. ఇప్పుడు మోడల్ స్కూళ్ల పేరిట ప్రభుత్వం బడులను ఎత్తివేసే ఆలోచన చేస్తుందన్న వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

కొత్త ‘మోడల్’తో బడికి మూత

కొత్త ‘మోడల్’తో బడికి మూత
Comments
Please login to add a commentAdd a comment