
వైరస్ కోళ్లు ఖననం
తాడేపల్లిగూడెం రూరల్ : బర్డ్ ఫ్లూ నేపథ్యంలో మండలంలోని పెదతాడేపల్లి పౌల్ట్రీ ఫారంలోని కోళ్లను సోమవారం వెటర్నరీ అధికారులు ఖననం చేశారు. వెటర్నరీ సిబ్బంది పీపీ కిట్లు ధరించి సుమారు 23 వేల కోళ్లను దశల వారీగా గోతుల్లో వేసి పూడ్చారు. వెటర్నరీ జేడీ మురళీకృష్ణ, డీడీ డాక్టర్ సుధాకర్, ఎంపీడీవో ఎం.విశ్వనాథ్, వెటర్నరీ ఏడీ డాక్టర్ అనిల్‌కుమార్, ఈవోపీఆర్‌డీ ఎం.వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి టి.రవిచంద్ర, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఇళ్ల తొలగింపును నిరసిస్తూ ధర్నా
భీమవరం: భీమవరంలోని కోర్టు పక్కన నివాసితుల ఇళ్లు తొలగించవద్దంటూ గణపతినగర్ పేదలు మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు బి.వాసుదేవరావు మాట్లాడుతూ పట్టణంలో బడాబాబులు ఆక్రమించిన స్థలాలు, కాల్వలను వదిలి పేదల ఇళ్లను తొలగించడం దారుణమన్నారు. గణపతినగర్‌లో చంటిపిల్లలు, వృద్ధులతో ఉంటున్న పేదల ఇళ్లు తొలగించడంతో చెట్టు కింద ఉండాల్సిన దుస్థితి కల్పించారని విమర్శించారు. మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు డి.త్రిమూర్తులు, ఎం.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
19 నుంచి టెక్నికల్ పరీక్షలు
భీమవరం: డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈ నెల 19 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. పరీక్షలకు హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పట్టణంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్ హైస్కూల్లో నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 131 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. డ్రాయింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలు 19 నుంచి 22 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు జరుగుతాయని టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్షలు 19 నుంచి 20 వరకు నిర్వహిస్తామన్నారు.
చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: వివిధ రకాల సమస్యలతో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి వచ్చేవారి సమస్యలను పూర్తిస్థాయిలో విచారణ చేసి పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం వినతులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీసుస్టేషన్ల అధికారులతో మాట్లాడి సమస్యలను చట్ట ప్రకారం విచారణ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితులతో గౌరవంగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని అనంతరం వాటిపై పూర్తిస్ధాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆధార్ క్యాంపులు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని అంగన్‌వాడీ పిల్లల నమోదుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక మొబైల్ ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లలకు కొత్త ఆధార్ కార్డు నమోదుకు ప్రత్యేక మొబైల్ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. ఫిబ్రవరి 18 నుంచి 21, ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 99 ఆధార్ కేంద్రాలలో క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు.

వైరస్ కోళ్లు ఖననం

వైరస్ కోళ్లు ఖననం
Comments
Please login to add a commentAdd a comment