
స్వాస్థ్య కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి
భీమవరం: 18 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలకు వచ్చే లోపాలు, వ్యాధులు గుర్తించడం, ఉచిత చికిత్స, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయడానికి రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎమ్ స్కూల్లో సోమవారం ఆర్‌బీఎస్‌కే వాహనాన్ని ప్రారంభి విద్యార్థులతో మాట్లాడారు. చికిత్స అవసరమైన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన ప్రత్యేక వాహనం ద్వారా తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం(డిఇఐసి)లో చికిత్సలు చేస్తారన్నారు. డీఇఐసీ కేంద్రంలో ప్రత్యేకంగా పిల్లల వైద్యులు, మెడికల్ అధికారి, డెంటల్ సర్జన్, ఫిజియోథెరపిస్ట్, సైకాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోలాజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఆప్తోమీటరిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్టాప్ నర్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని అంగన్‌వాడీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1,98,895 పిల్లలకు పరీక్షలు నిర్వహించగా 1,043 మంది పిల్లల్లో సమస్యలు గుర్తించి తణుకులోని వైద్య సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భానునాయక్, ఆర్‌బీఎస్‌కే కోఆర్డినేటర్ డాక్టర్ బి.భావన, డీఈవో ఇ.నారాయణ, డీఎన్నార్ విద్యాసంస్థల సెక్రటరీ గాదిరాజు సత్యనారాయయణరాజు పాల్గొన్నారు.
దోమల నివారణకు చర్యలు చేపట్టాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దోమల నిర్మూలనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, మలేరియా అధికారులు, పంచాయతీ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దోమల నివారణ, పారిశుద్ధ్యం, వర్మీ కంపోస్ట్ తయారీ, ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలపై సమీక్షించారు. రాజమండ్రి నుంచి జూమ్ కాన్ఫరెనన్స్‌లో పాల్గొన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్‌డీ సీహెచ్.నాగ నరసింహం జిల్లాలో దోమల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులకు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోజు, రోజుకు పెరిగిపోతున్న దోమలను నిర్మూలించేందుకు మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో కూడా వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయ బయో ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్కరు గుడ్డ సంచి, లేదా జ్యూట్ బ్యాగులను వెంట తీసుకెళ్లాలన్నారు. పారిశుద్ధ్యం పర్యవేక్షణకు ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని, నోడల్ అధికారులను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి బి.అరుణ శ్రీ, మెప్మా అధికారి గ్రంధి పార్వతి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నాగరాణి
Comments
Please login to add a commentAdd a comment