మండవల్లి: తనకు గ్రామ బహిష్కరణ లేకుండా రక్షణ కల్పించాలని ఓ గొర్రెల పెంపకందారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొవ్వాడలంక గ్రామవాసి త్రిమూర్తులు గొర్రెల పెంపకందారుడు. గొర్రెల పెంపకం వలన గ్రామ వాతావరణం కాలుష్యమౌతుందంటూ గ్రామం నుంచి బహిష్కరిస్తామని సర్పంచ్‌తోపాటు స్థానిక పెద్దలు గ్రామ సభ ద్వారా హెచ్చరికలు జారీ చేశారని త్రిమూర్తులు మంగళవారం మండవల్లిలో పేర్కొన్నాడు. గ్రామసభ ఏర్పాటు చేసి, గొర్రెలను స్వాధీనం చేసుకుని కఠినమైన చర్యలు తీసుకుంటామని గ్రామ చావడి మైక్ ద్వారా తెలియజేశారన్నాడు. తనకు గ్రామ బహిష్కరణ లేకుండా రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
ఐటీఐలో ఉచిత కంప్యూటర్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
ఉండి: ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐలో ఏపీ ఎస్‌ఎస్‌డీసీ వారి ఆధ్వర్యంలో 45 రోజుల కంప్యూటర్ కోర్సుపై ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, జిల్లాలో ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ వీ శ్రీనివాసరాజు మంగళవారం తెలిపారు. పదో తరగతి ఆపైన పాస్ అయ్యి ఉండాలని, 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు గలవారు అర్హులన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అభ్యర్థులు ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్‌తోపాటు ఉద్యోగ అవకాశం కల్పించబడుతుందన్నారు. వివరాలకు 94928 85556, 08816 297093 నంబర్లలో సంప్రదించాలన్నారు.
యువతి ఆత్మహత్య
నరసాపురం రూరల్: కొప్పర్రు గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని పంటకాలువ సమీపంలో ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటున్న ఎరిచర్ల సిరి అనే యువతి సోమవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి సోదరుడు చందు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే ఈ సమాచారంపై పోలీసులను సంప్రందించగా వారు స్పందించలేదు.
బంగారు, వెండి ఆభరణాలతో నవ వధువు పరారీ
ఏలూరు (టూటౌన్): నవ వధువు బంగారం, వెండి ఆభరణాలు పట్టుకుని పరారైన ఘటన ఏలూరు నగరంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఏలూరు గజ్జల వారి చెరువు సమీపంలో వి.శివ నాగ సాయి కృష్ణ జ్యూస్ దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. గత నెల 31వ తేదీన అతనికి విశాఖపట్టణం కంచరపాలెం ప్రాంతానికి చెందిన బోడేపు చంద్రహాసినితో వివాహమైంది. అత్తవారింటి నుంచి ఏడు రోజుల క్రితం ఏలూరు నగరానికి చేరుకున్న కొత్తజంట కొత్త కాపురాన్ని బిట్టుబారు సమీపంలో ఉన్న అద్దె ఇంట్లో మొదలుపెట్టారు. అయితే ఈ నెల 16వ తేదీన భార్యాభర్తలు ఇద్దరు నిద్రకు ఉపక్రమించగా, 17వ తేదీన శివ నిద్రలేచి చూసేసరికి నవవధువు ఇంటి నుంచి పరారైనట్లు గుర్తించాడు. ఆమె వెళ్తూవెళ్తూ నాలుగు కాసుల బంగారు గొలుసు, ఉంగరం, వెండి పట్టీలు సెల్‌ఫోన్‌తో పరారైనట్లు శివ గుర్తించాడు. ఆమె ఆచూకీ కోసం ఆమె తండ్రితో కలిసి వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment