
తాబేళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు
నరసాపురం రూరల్: సముద్ర పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం నరసాపురం మండలం సముద్ర తీర ప్రాంతమైన చినమైనవానిలంక గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాబేళ్ల గుడ్ల సేకరణ, సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డితో కలసి ఆమె పరిశీలించారు. అటవీశాఖ అధికారులను గుడ్లు సంరక్షణకు చేపట్టిన ప్రత్యేక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ సముద్ర వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా సముద్రజీవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. గత నెలలో పదుల సంఖ్యలో తాబేళ్లు చనిపోయి సముద్రతీర ప్రాంతానికి కొట్టుకురావడం చాలా బాధ కలిగించిందన్నారు. ఈ విషయమై సంబందిత అధికారులతో సమావేశమై తాబేళ్లు చనిపోవడానికి గల కారణాలను విశ్లేషించేందుకు పోస్టుమార్టం చేయించామన్నారు. ఆ నివేదక ఇంకా అందాల్సి ఉందన్నారు. తదుపరి చర్యల్లో బాగంగా అటవీశాఖ పర్యవేక్షణలో తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టే ప్రాంతాలను గుర్తించి వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్టోబరు నుంచి ఏప్రిల్ వరకూ తాబేళ్లు సముద్రపు ఒడ్డున అనువైన ప్రాంతంలో గుడ్లు పెట్టే సమయం అని, అనంతరం ఆ గుడ్లనుంచి పిల్లలు బయటకు వస్తాయన్నారు. ఆలీవ్‌రెడ్లీ జాతి తాబేళ్లు పెట్టిన సుమారు 4,400 గుడ్లను హేచరీలో ఉంచామని, రానున్న రెండు నెలల కాలంలో మరో 25 వేల గుడ్లు పెట్టే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చిన అనంతరం వాటిని సముద్రంలోని విడచి పెట్టే కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తామన్నారు. తద్వారా సముద్ర జీవుల పట్ల అవగాహన కలుగుతుందన్నారు. తాబేళ్లు ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టేందుకు అనువుగా సముద్రం అంచున వలలను అడ్డంకిగా లేకుండా చూడాలని మత్స్యకారులకు సూచించారు. మానవ మనుగడకు సముద్ర వాతావరణం సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మడ అడవులను నరికితే చర్యలు
చినమైనవానిలంకలో తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ నాగరాణి దర్బరేవు, రాజల్లంక ప్రాంతాల్లోని మడ అడవులను బోటులో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మడ అడవులను పెరగనివ్వాలని, వాటిని అక్రమంగా నరికితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సముద్రతీర ప్రాంతం కోతకు గురికాకుండా మడ అడవులు రక్షణగా నిలుస్తాయన్నారు. ఇప్పటికే సముద్రం పెదమైనవానిలంక, చినమైనవానిలంక ప్రాంతాల్లో ముందుకు చొచ్చుకుని వచ్చిన విషయం తెలిసిందన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పెదమైనవానిలంక గ్రామంలో ఒక కిలోమీటర్ మేర నిర్మించనున్న సముద్ర రక్షణ గోడకు రూ.35 కోట్లు వ్యయం అవుతుందని ఈ నిధులను మంత్రి కేటాయించారన్నారు. పనులను ఎలైట్ కంపెనీ త్వరలో ప్రారంభిస్తుందన్నారు. వాస్తవంగా ఏడు కిలోమీటర్ల మేర ఈ రక్షణ గోడను నిర్మించాల్సి ఉందని ప్రస్తుతం ఒక కిలోమీటరు మాత్రమే ఈ గోడను నిర్మిస్తారన్నారు. చినమైనవానిలంకలోని నల్లీక్రీక్‌పై వంతెనను ఆర్‌అండ్‌బీ అధికారులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. వంతెన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయని వెంటనే పనులు ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి ఆశాకిరణ్, ఆర్డీవో దాసి రాజు, డీఎస్పీ శ్రీవేద, నరసాపురం తహసీల్దార్ రాజరాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
తాబేళ్ల గుడ్ల సంరక్షణకు హేచరీ ఏర్పాటు
మడ అడవులను పరిశీలించిన పశ్చిమ కలెక్టర్
తీరప్రాంత గ్రామాల్లో కలెక్టర్ నాగరాణి పర్యటన

తాబేళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు
Comments
Please login to add a commentAdd a comment