
రక్తదానమే లక్ష్యంగా.. హోప్ పయనం
కై కలూరు: నిండు ప్రాణాలను కాపాడటంలో కలిగే సంతోషం ఎన్ని లక్షలు పెట్టినా రాదు. ఇదే నినాదంతో 2022లో ఏర్పాటైన హోప్ చారిటబుల్ ట్రస్ట్ సేవలందిస్తోంది. కై కలూరు నియోజకవర్గం కలిదిండి మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన అల్లాడి రవితేజ స్నేహితులతో కలసి ఓ వాట్సాప్ గ్రూఫ్‌ను క్రియేట్ చేశాడు. ఒక్క అడుగుతో మొదలైన సేవా ప్రస్థానం ఇప్పుడు ఏకంగా 200 మంది సభ్యులకు చేరింది. రక్తదానమే పరమావధిగా సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 25 ప్రముఖ బ్లడ్ బ్యాంకులలో రక్తాన్ని అందించే స్థాయికి చేరింది. ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు, గర్భిణీలు, క్యాన్సర్ పేషెంట్లు, తలసేమియా చిన్నారులు, అత్యవసర చికిత్సలు ఇలా 16,700 యూనిట్ల రక్తదానం సభ్యులు చేశారు. సేవే పరమార్థంగా పనిచేస్తున్న సభ్యులను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
తలసేమియా చిన్నారులకు దేవుళ్లు
తలసేమియా చిన్నారులకు ప్రతి 21 రోజులకు రక్తమార్పిడి జరగాలి. వీరి ఇబ్బందులను గుర్తించిన సంస్థ సభ్యులు భీమవరం, ఉండి, కై కలూరు, కలిదిండి, పాలకొల్లు, నరసాపురం, తణుకు ఇలా అనేక ప్రాంతాల్లో జల్లిడ పట్టి మొత్తం 52 మంది చిన్నారులను గుర్తించారు. వీరి కోసం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఆనంద్ బ్లడ్ బ్యాంకులో వివిధ గ్రూఫుల రక్తాన్ని నిల్వ చేస్తున్నారు. చిన్నారులకు అమృత హాస్పటల్‌లో రూ.1000 ఖరీదు కలిగిన రక్తం ఎక్కించే ఫిల్టర్లను సైతం వీరే అందిస్తున్నారు. మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, అంబేడ్కర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీ రామారావుల వర్ధంతి, చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజులు ఇలా పలు సందర్భాల్లో రక్తదానం సేకరించి ప్రమాదంలో ప్రజలకు సంస్థ సభ్యులు సేవ చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో 25 బ్లడ్ బ్యాంకులకు రక్తదానం
వాట్సాప్‌లో 200 మంది సభ్యుల చేరిక
52 మంది తలసేమియా చిన్నారులకు ప్రతినెలా రక్తదానం
రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 వేల మందికి రక్తదానం

రక్తదానమే లక్ష్యంగా.. హోప్ పయనం
Comments
Please login to add a commentAdd a comment