
కుటుంబ కలహాలే కారణమా!
● గోస్తనీ కాలువలో దూకి ఆదివారం మహిళ ఆత్మహత్య
● సోమవారం కాలువలో లభ్యమైన మృతదేహం
● విలపిస్తున్న కుటుంబసభ్యులు
తణుకు అర్బన్: తణుకు సజ్జాపురంలో నివసించే గుమ్మళ్ల శాంతి (48) మంగళవారం ఆంధ్రాసుగర్స్ ప్రాంతంలోని కాలువలో శవమై తేలింది. ఆమె ఆదివారం రాత్రి 2.30 గంటలకు ఇంటి నుంచి బయటకు రావడం, సోమవారం ఉదయం గోస్తనీ కాలువ జాతీయరహదారి వంతెనపై ఆమె బూట్లు కనిపించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని నిర్థారణకు రావడంతో పోలీసులు, అగ్నిమాపక అధికారులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆమె మృతదేహం ఆంధ్రా సుగర్స్ ప్రాంతంలో లభ్యమైంది. ఇటీవల కుటుంబ కలహాలతో కొన్ని మనస్పర్ధలు ఏర్పడ్డాయని అందుకే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి పోలీసుల పంచనామా అనంతరం పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కుటుంబమంతా వెల్‌నెస్‌పైనే ఉపాధి
శాంతి కుటుంబమంతా వెల్‌నెస్ సెంటర్‌లపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. వృద్ధులైన తన తల్లిదండ్రులతోపాటు ఇద్దరు కుమారులతో సజ్జాపురం పార్కు ప్రాంతంలో శాంతి నివసిస్తోంది. పెద్దకుమారుడు దుర్గాప్రసాద్ వివాహానంతరం కాకినాడలో వెల్‌నెస్ సెంటర్ నడుపుతూ అక్కడే నివసిస్తుండగా, చిన్న కుమారుడు పవన్ తణుకు బొమ్మల వీధిలో వెల్‌నెస్ సెంటర్ కోచ్‌గా ఉన్నారు. అయితే గతంలో స్థూలకాయంతో ఉండే శాంతి వెల్‌నెస్ సెంటర్‌లో వాడిన మందులతో సన్నబడి ఎంతో హుషారుగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. తను మారిన విధానాన్ని అందరికీ తెలిసేలా ఫొటోలు, వీడియోలను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసేవారని, తన కుటుంబంతో కూడా ఎంతో సంతోషంగా గడిపేవారని, కుమారులిద్దరితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసేవారని అటువంటి ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందోనని స్థానిక ప్రజానీకం చర్చించుకుంటున్నారు. గోస్తనీ కాలువలో ఆమె శవమై తేలడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఆమె విగతజీవిగా కనిపించడంతో కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment