ఉపాధి కూలీలను ఢీకొన్న ట్రాక్టర్
కొయ్యలగూడెం: ఉపాధి పనుల కోసం వెళుతున్న కూలీలను ట్రాక్టర్ ఢీకొన్న ఘటన కుంతలగూడెం సమీపంలో మంగళవారం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం కుంతలగూడెంకు చెందిన కొందరు కూలీలు మంగళవారం ఉపాధి పనుల కోసం వెళ్తున్నారు. ఆ సమయంలో చిన్నాయగూడెం వైపు వెళుతున్న ట్రాక్టర్ అతి వేగంగా వచ్చి కూలీలను ఢీకొంది. ఈ ప్రమాదంలో అల్లె భాగ్యవతి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈమెతో పాటుగా మరో ముగ్గురు కూలీలు రాపాక నాగమణి, చాపల ఇమ్మెలియా, బాసుబోయిన పోసమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మెరుగైన వైద్యం నిమిత్తం తరలించినట్లు ఏపీవో నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో ఇమ్మెలియా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు 108 టెక్నీషియన్ బద్రి పేర్కొన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త వలనే ప్రమాదం సంభవించిందని కూలీలు ఆరోపించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలానికి ఎస్సై వి.చంద్రశేఖర్ చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment