నిరుద్యోగుల్లో నిరుత్సాహం
బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సాక్షి, భీమవరం: డీఎస్సీ, గ్రూపు పరీక్షలు, పోలీస్ రిక్రూట్‌మెంట్, ఏపీపీఎస్సీ తదితర వాటి ద్వారా ప్రభుత్వ కొలువుల కోసం ఇంటి వద్ద, జిల్లాలో, విశాఖ, విజయవాడ, హైదరాబాద్ తదితర నగరాల్లోని కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్న వారు ఎందరో ఉన్నారు. వీరంతా వేలు, లక్షల్లో ఫీజులు చెల్లించి శిక్షణ తీసుకుంటున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అయినకాడికి అప్పులు చేసి శిక్షణ ఇప్పిస్తున్నారు. బయటి ప్రాంతాల్లో ఉంటున్న వారికి హాస్టల్, మెస్ నిమిత్తం నెలకు ఆరు వేలకు పైనే ఖర్చవుతుంది. మరోపక్క డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర చదువులు చదువుకుని కుటుంబ ఆర్ధిక పరిస్థితులతో చాలీచాలనీ జీతంపై వివిధ వ్యాపార, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిలో ఎంతోమంది తమ చదువుకు తగిన ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారు.
పత్తాలేని హామీలు
కూటమి ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్‌లో నిరుద్యోగ యువతకు పెద్దపీట వేశామని చెప్పారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేస్తామన్నారు. అంతవరకూ నిరుద్యోగ భృతి అందజేస్తామంటూ ఊదరగొట్టారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది నెలలైనా వాటి ఊసెత్తకపోవడం ఆయా వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మరోపక్క తొలి సంతకం పేరిట 16 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించినా షెడ్యూల్ విడుదల చేయకుండా విద్యాసంవత్సరం పాటు కాలయాపన చేసింది. ఇప్పుడు ఉన్న పోస్టులకు కోత పెట్టేందుకు మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఎత్తుగడ వేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 5.17 లక్షలు, ఏలూరు జిల్లాలో ఐదు లక్షల కుటుంబాలు ఎన్నికల వాగ్దానాల అమలుకోసం ఎదురుచూస్తున్నారు.
పెల్లుబుకుతున్న అసంతృప్తి
నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీగా ఉందంటూ సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించిన విషయం విదితమే. నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగభృతి హామీలదీ అదే దారి. సామాజిక మాద్యమాల ద్వారా ఇప్పటికే వివిధ వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ప్రస్తుత తరుణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి నేతలకు తలనొప్పిగా తయారయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1,08,019 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా వీరిలో కొత్త పశ్చిమగోదావరి జిల్లాలో 64,327 మంది, ఏలూరు జిల్లాలో 43,692 మంది ఉన్నారు. ఈ నెల 27న పోలింగ్ జరుగనుంది. ఎన్నికల్లో గెలుపుకోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూటమి నేతలు ఆపసోపాలు పడుతున్నారు. 2024 జూన్ నుంచే హామీలు అమలని చెప్పి ముఖం చాటేసి ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేస్తామంటూ కూటమి నేతల మాటలను ఎన్నికల జిమ్మిక్కుగానే కొట్టిపారేస్తున్నారు.
న్యూస్‌రీల్
రాసిపెట్టుకోండి తమ్ముళ్లు.. అధికారంలోకి వచ్చాక ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మొదటిగా 2025 జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.
– జిల్లాలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్
ఏపీలోని యువతను ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాం. పరిశ్రమలు తెస్తాం. ఉద్యోగాలిస్తాం. హైటెక్ టవర్లు నిర్మించి వర్క్‌ఫ్రం హోమ్ తెస్తాం. మీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను.
– పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల సభల్లో చంద్రబాబు
జాడలేని జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి
మెగా డీఎస్సీపై నోరు మెదపని సర్కారు
హామీల అమలు కోసం నిరుద్యోగుల ఎదురుచూపు
పట్టభద్రుల ఓట్లు వేటలో కూటమి నేతల అంతర్మథనం
ఉమ్మడి జిల్లాలో 1,08,019 గ్రాడ్యుయేట్ ఓటర్లు
నిరుద్యోగులకుప్రతి నెలా రూ.3 వేల భృతి
తొమ్మిది నెలలైంది.
హామీల అమలు ఎప్పుడు ?
మెగా
డీఎస్సీ
నిరుద్యోగుల్లో నిరుత్సాహం
Comments
Please login to add a commentAdd a comment