బర్డ్‌ఫ్లూ పంజా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ విజృంభన కొనసాగుతోంది. బర్డ్‌ఫ్లూతో ఇప్పటికే లక్షల సంఖ్యలో చనిపోయాయి. దాదాపు 19 ఏళ్ళ తరువాత జిల్లాలో బర్డ్‌ఫ్లూ వల్ల పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. సంక్రాంతి ముందు నుంచే వైరస్ లక్షణాలతో కోళ్ళు చనిపోతుండగా శీతల ప్రభావమంటూ అధికారులు కొట్టిపడేశారు. ఒక్కసారిగా గత వారం పది రోజుల నుంచి బర్డ్‌ఫ్లూ పంజా విసరడంతో సుమారు 15 లక్షల వరకు లేయర్ కోళ్ళు, 50 వేల వరకు బ్రాయి లర్ కోళ్ళు చనిపోయినట్టు అంచనా. కోళ్ళ మేత, గుడ్లు, అన్నింటి విలువ కలుపుకొని సుమారు రూ. 70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పౌల్ట్రీ రంగం గణనీయంగా విస్తరించింది. జిల్లాలో సుమారు 200 పౌల్ట్రీలు ఉండగా వాటిలో 2.20 కోట్ల లేయర్ కోళ్లు ఉన్నాయి. ప్రస్తుతం సగటున ప్రతిరోజూ 1.30 కోట్ల కోళ్ల ద్వారా 1.10 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. ప్రధానంగా ఒడిశా, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు 70 శాతం గుడ్ల ఎగుమతులు జరుగుతుండగా, మిగిలిన 30 శాతం గుడ్లు స్థానిక అవసరాలకు వినియోగిస్తున్నారు.
2006లో రూ.50 పైసలకు పడిపోయిన గుడ్డు
2006లో జిల్లాలో మొట్టమొదటిసారిగా పౌల్ట్రీల్లో బర్డ్‌ఫ్లూను గుర్తించారు. అప్పట్లో జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్ళు చనిపోయాయి. రూ.1.90 ఉన్న గుడ్డు ధర రూ.50 పైసలకు పడిపోవడంతో పౌల్ట్రీలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ క్రమంలో వ్యాక్సినేషన్లు, ఇతర జాగ్రత్తల ద్వారా వైరస్‌లను అధిగమిస్తూ రెండేళ్ళలోనే పౌల్ట్రీల వ్యవస్థను గాడిలో పెట్టారు. 19 ఏళ్ళ తరువాత జిల్లాలో వైరస్‌ను గుర్తించడం, అది కూడా లక్షల సంఖ్యలో కోళ్ళు చనిపోయాక గుర్తించడం గమనార్హం. వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగ్గా చేయకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి చెందిందనేది పౌల్ట్రీ వర్గాల భావన. జిల్లాలో ఉంగుటూరు, బాదంపూడి, తణుకు రూరల్, వేల్పూరు, పెరవలి, తాడేపల్లిగూడెంతో పాటు అనేక ప్రాంతాల్లో కోళ్ళ ఫారాలున్నాయి.
11న జిల్లాలో వైరస్ గుర్తింపు
ఈ నెల 11న జిల్లాలో వైరస్‌ను గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో బాదంపూడిలోని పౌల్ట్రీలో రోజుకు 3 నుంచి 4 వేల కోళ్లు చనిపోవడం గుర్తించారు. అధికార యంత్రాంగం వారం రోజుల తరువాత అలెర్ట్ అయింది. వాస్తవానికి ప్రతి రోజూ పౌల్ట్రీల్లో సాధారణ పరిస్థితులను బట్టి లక్షల కోళ్ళు ఉన్నచోట 30 నుంచి 50 కోళ్లు చనిపోతుంటాయి. బాదంపూడి, వేల్పూరు, తణుకు రూరల్‌లో ఎక్కువగా కోళ్లు చనిపోవడంతో వాటిని ల్యాబ్‌కు పంపగా ఏమియాన్ ఇన్‌ఫ్లుయాంజ్ (హెచ్ 5ఎన్–1) వైరస్‌గా గుర్తించారు.
లక్షల కోళ్లు, గుడ్లు పూడ్చివేత
జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఫారం కోళ్లు, 50 వేల బ్రాయిలర్ కోళ్లు వైరస్‌తో చనిపోయాయని పౌల్ట్రీ వర్గాల అంచనా. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖాధికారులు వైరస్ గుర్తించిన పౌల్ట్రీలకు 10 కిలోమీటర్ల దూరం వరకు అలెర్ట్ జోన్లుగా ప్రకటించి చికెన్, గుడ్ల విక్రయాలను నిషేధించారు. వైరస్ ఉన్న కోళ్ళ ఫారాల ప్రాంతాలను ఇన్ఫెక్షన్ జోన్లుగా ప్రకటించి వెటర్నరీ వైద్యులతో 25 బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఏలూరు జిల్లాలో 1.24 లక్షల కోళ్ళు, 1.85 లక్షల కోళ్ళ మేతలు, లక్షకు పైగా గుడ్లను భూమిలో పూడ్చివేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2 పౌల్ట్రీల్లో 22 వేల కోళ్ళు, 24,660 గుడ్లు, 20 కిలోల మేతను పూడ్చివేశారు.
ఇంతవరకు 15 లక్షల లేయర్ కోళ్ల మృత్యువాత
సుమారు రూ.70 కోట్లకు పైగా పౌల్ట్రీలకు నష్టం
జిల్లా వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ జోన్ల గుర్తింపు
రెడ్ జోన్ పరిధిలోని పౌల్ట్రీలు మూడు నెలల పాటు మూసివేత
మూడు రోజులుగా కొనసాగుతున్న శానిటేషన్ ప్రక్రియ
Comments
Please login to add a commentAdd a comment