
బలివే తీర్థానికి తమ్మిలేరు నీరు విడుదల
చింతలపూడి: మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని బలివే తీర్థానికి తమ్మిలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేసినట్లు తమ్మిలేరు ఇరిగేషన్ డీఈ సీతారామ్ మంగళవారం తెలిపారు. ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి 100 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి విడుదల చేశామని తెలిపారు. దాదాపు 40 కిలోమీటర్లు ప్రధాన కాల్వ ద్వారా ప్రయాణించి నడిపల్లి చెరువులోనికి చేరుతుందని చెప్పారు. అక్కడి నుంచి బలివేకు భక్తుల కోసం నీటిని వంతుల వారీగా తరలిస్తామన్నారు. బలివేకు వచ్చే భక్తులకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నా మని చెప్పారు. మొత్తం తీర్థానికి 500 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నట్లు తెలిపారు.
గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ద్వారకాతిరుమల: గురుకులంలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థినుల నుంచి దరఖాస్తులను ీస్వీకరిస్తున్నట్టు స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ బి.రాణి తెలిపారు. మార్చి 6తో ఈ గడువు ముగుస్తుందన్నారు. అర్హులైన విద్యార్థినులు సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 1న అడ్మిట్ కార్డులు జారీ, అదే నెల 6న ఉదయం 10 గంటల నుంచి 5వ తరగతి ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్ధి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఏడాదికి లక్ష రూపాయలు కలిగిన ధ్రువీకరణ పత్రం ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులు 2012 సెప్టెంబర్ 1 నుంచి, 2016 ఆగస్టు 31 మధ్య జన్మించాలన్నారు. జూనియర్ ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే వారికి 2025 ఆగస్టు 31 నాటికి 17 ఏళ్లు మించకూడదన్నారు.
నరసాపురం ఆసుపత్రిలో దివ్యాంగుల పాట్లు
నరసాపురం: నరసాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం దూరప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులు నానా ఇబ్బందులు పడ్డారు. సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో ఆసుపత్రికి పిలిపించి గంటల సేపు నిలబెట్టారు. దీంతో దివ్యాంగులు అవస్థలు పడ్డారు. ఆసుపత్రిలో గత 15 రోజుల నుంచి సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. నరసాపురం, మొగల్తూరు మండల పరిధిలో గతంలో సదరం సర్టిఫికెట్లు పొందిన వారిలో ఫేక్ సర్టిఫికెట్‌లు గుర్తించడం కోసమని ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్ల ద్వారా దివ్యాంగులను ఆసుపత్రికి పిలుస్తున్నారు. వారికి టైం స్లాట్‌ల సౌకర్యం, వెలుసుబాటు కల్పించకపోవడంతో ఉదయం 9 గంటలకు వచ్చిన వారు సాయంత్రం 5 గంటల వరకూ వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment