ఉద్యాన పంటలకు ఉపాధి నిధులు
పాలకొల్లు అర్బన్: ఉపాధి హామీ పథకం నిధులతో నూరు శాతం సబ్సిడీ అందించి ఉద్యాన పంటలు పెంచుకోవడానికి రైతులను గుర్తించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులకు ఆదేశాలిచ్చారు. పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో పట్టణం, పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల అధికారులతో మంగళవారం సమీక్షా నిర్వహించారు. నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల సాగును పెంచే దిశగా సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలని కోరారు. ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుని రైతులను గుర్తించాలన్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో నూరుశాతం సబ్సిడీ అందిస్తున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన సన్న, చిన్నకారు రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఒక్కొక్క రైతుకు నూరుశాతం సబ్సిడీ అందజేస్తారన్నారు. మూడేళ్ల కాలానికి అత్యల్పంగా మునగ సాగుకు రూ.27,515, దానిమ్మ సాగుకు ఎకరానికి రూ.2,16,417 అందజేస్తారన్నారు. ఉద్యాన పంటల సాగుకు రైతులను గుర్తించి జాబితాలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారికి అందజేయాలని కోరారు. కార్యక్రమంలో డ్వామా పీడీ డా.కేసీహెచ్ అప్పారావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి ఆర్.దేవేంద్రకుమార్, మునిసిపల్ కమిషనర్ బి.విజయసారథి తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని సంబంధిత అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి మంచి ప్రగతి సాధించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో సూర్య ఘర్ యోజన పథకం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 13,202 దరఖాస్తులు రిజిస్టర్ కాగా కేవలం 633 గృహాలకు మాత్రమే సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశారన్నారు. ఈ పథకం అమలు సంతప్తికరంగా లేదన్నారు. సోలార్ ప్యానల్ ఏర్పాటుపై అవగాహన కల్పిస్తే పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వచ్చి ఏర్పాటుకు సంసిద్ధంగా ఉంటారన్నారు. పథకం ప్రారంభించి సంవత్సరం పూర్తయిన పూర్తిస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడంలో వెనుకబాటు కనిపిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment