
కూటమి నేతలకే పల్లె పండుగ
సాక్షి, భీమవరం: ఉపాధి హామీ నిధులతో గ్రామా ల్లో రోడ్లు నిర్మాణానికి గత అక్టోబరులో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని 350 పంచాయతీల పరిధిలో రూ.46.48 కోట్ల వ్యయంతో 66.6 కి.మీ రోడ్ల అభివృద్ధికి 360 పనులు మంజూరు చేసింది. వీటిలో 53.55 కి.మీ మేర రూ.42.42 కోట్ల విలువైన 349 సీసీ రోడ్లు, 11.67 కి.మీ మేర రూ.3.71 కోట్ల విలువైన తొమ్మిది బీటీ రోడ్లు, 1.3 కి.మీ మేర రూ.35 లక్షల విలువైన రెండు డబ్ల్యూబీఎం రోడ్లు ఉన్నాయి. కూటమి నాయకులు సూచించిన వారికే ఆయా పనులను కట్టబెట్టారు. కొన్నిచోట్ల కూటమి నాయకులే కాంట్రాక్టర్ల అవతారమెత్తి పనులు చేస్తుండగా, మరికొన్ని చోట్ల తమకు పర్సంటేజీలు ఇచ్చేలా కాంట్రాక్టర్లకు పనులను అప్పగించినట్టు తెలుస్తోంది.
నాణ్యతపై అనుమానాలు
పల్లె పండుగ రోడ్ల నిర్మాణ పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఇప్పటివరకు సుమారు రూ.20 కోట్ల విలువైన 45.8 కి.మీ మేర 295 సీసీ రోడ్ల పనులు చేయగా, 2.8 కి.మీ మేర రూ.95 లక్షల విలువైన రెండు బీటీ రోడ్లు, 1.4 కి.మీ మేర రూ.24 లక్షల విలువైన రెండు డబ్ల్యూబీఎం రోడ్డు పనులు జరిగాయి. పలుచోట్ల పనుల్లో నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ రోడ్లు నిర్మించినా బెర్ములు వేయకపోవడంతో రోడ్ల అంచులు ప్రమాదభరితంగా ఉంటున్నాయని స్థానికులు అంటున్నారు.
ఇష్టానుసారంగా నిర్మాణాలు
ప్రజావసరాల మేరకు రోడ్లు నిర్మాణం చేయాల్సి ఉంది. కాలనీలు, గ్రామ శివార్లలోని జనావాసాల్లో రోడ్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పల్లె పండుగలో చేపట్టాల్సిన పనులు గుర్తించేందుకు పేరుకు గ్రామ సభలు నిర్వహించినా కూటమి నాయకులు పెట్టిన పనులనే అధికారులు ఆమోదించారు. ఎక్కువ మంది జనం నివసిస్తున్న ప్రాంతాలు, ముంపు బారిన పడే కాలనీల్లో కాదని తమకు కావాల్సిన చోట పనులు ప్రతిపాదించారని, తమ భూముల విలువలు పెంచుకునేలా ఖాళీ స్థలాలు, పొలాలు, చెరువులకు రోడ్లు వేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల పాత సీసీ రోడ్లపై మరలా కొత్తగా సీసీ రోడ్లు వేస్తుండటంతో పూర్వపు ఇళ్లు పల్లమైపోయి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో గత టీడీపీ హయాంలో చేసిన రోడ్లకు కొత్తగా మెరుగులు దిద్ది బిల్లులు చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా పనులు పూర్తయిన మేరకు ఇప్పటివరకు రూ.1.75 కోట్ల బిల్లులు చెల్లింపులు చేయగా మరో రూ.11.5 కోట్ల మేర బిల్లులు చెల్లించేందుకు అధికారులు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా అక్రమాలకు తావులేకుండా నిబంధనల మేరకే పనులు చేస్తున్నట్టు డ్వామా అధికారులు చెబుతున్నారు.
పంచుకో.. దోచుకో..
పల్లె పండుగలో జిల్లాకు రూ.46.48 కోట్లతో 360 రోడ్ల మంజూరు
నేతలు సిఫార్సు చేసిన చోటే పనులు
రూ.20 కోట్లతో 299 పనులు పూర్తి
కొన్నిచోట్ల చేపల చెరువులు, ఖాళీ స్థలాలకు రహదారులు
గత టీడీపీ హయాంలో చేసిన పనులకూ ఇప్పుడు బిల్లులు చేసుకునే ప్రయత్నాలు
పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామ శివార్ల నుంచి పంట పొలాలు, ఆక్వా చెరువులకు వెళ్లేందుకు ఉపాధి హామీ పథకం నిధులు రూ.30 లక్షలతో 482 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించారు. పంట, ఆక్వా ఉత్పత్తులు తరలించుకునేందుకు ఈ రోడ్డును వినియోగిస్తుంటారు. గ్రామంలోని జనావాసాల్లో పలుచోట్ల రహదారుల సదుపాయం సరిగా లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే అక్కడ కాదని పొలాలు, చెరువులకు వెళ్లే కంకర రోడ్డును సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయడం గమనార్హం.
భీమవరం రూరల్ మండలం దొంగపిండి గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడి ప్రాంతంలో దాదాపు పది కుటుంబాలకు పైగా నివసిస్తున్నాయి. మట్టిరోడ్డుతో వర్షం వస్తే రాకపోకలకు ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయితే పల్లె పండుగ కార్యక్రమంలో గ్రామంలోని మరోచోట ఖాళీ స్థలాల మీదుగా కొన్ని కుటుంబాలు వారు నివసిస్తున్న ప్రాంతానికి రూ.11.75 లక్షల వ్యయంతో 137 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణం చేశారు.

కూటమి నేతలకే పల్లె పండుగ
Comments
Please login to add a commentAdd a comment