గురువుల్లో గుబులు | - | Sakshi
Sakshi News home page

గురువుల్లో గుబులు

Published Sun, Mar 9 2025 12:48 AM | Last Updated on Sun, Mar 9 2025 12:47 AM

గురువ

గురువుల్లో గుబులు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపడతామని కూటమి ప్రభుత్వం తెలపడంతో ఆయా వర్గాల్లో హడావుడి మొదలైంది. ఈ మేరకు ప్రభుత్వం ముసాయిదా బిల్లు విడుదల చేసి ఈనెల 7 వరకు సలహాలు, సూచనలను కోరింది. ఉపాధ్యాయుల అభ్యర్థనల మేరకు అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి గాని ప్రభుత్వం బదిలీలపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉండగా అప్పుడే బదిలీల ప్రక్రియ పూర్తిచేసినట్టు కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. దీంతో త్వరలో చేపట్టనున్న బదిలీల్లో తమకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో అనే చర్చ ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులకు ఈసారి బదిలీల్లో స్థాన చలనం తప్పదు.

విడుదల కాని జీఓ : మే నెలాఖరులోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ జీఓ విడుదల కాలేదు. మే నెలాఖరులోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయడం కష్టసాధ్యమని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చేపట్టే బదిలీల కౌన్సెలింగ్‌ విద్యాశాఖాధికారులకు కత్తిమీద సాములాంటిది. ఇదిలా ఉండగా జిల్లా విద్యాశాఖాధికారులు ఇటీవల సీనియార్టీ జాబితాను విడుదల చేసి ఈనెల 9లోపు అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యాలయానికి వందల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తోంది.

11,391 మంది ఉపాధ్యాయులు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 11,391 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండ్‌ గ్రేడ్‌ టీచర్లు, హెచ్‌ఎంలు పనిచేస్తున్నారు. గతంలో జరిగిన పని సర్దుబాటులో కొందరు మిగులు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే అసలు జిల్లాలో ఖాళీ పోస్టులు ఎన్ని, మిగులు ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని వంటి వివరాలు తెలియకుండా బదిలీల ప్రక్రియ ఎలా చేపడతారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పష్టత రావడానికి కాస్త సమయం పడుతుందని, ఇవన్నీ తేలే వరకూ బదిలీలకు అవకాశం ఉండదంటున్నారు.

హైస్కూల్‌ ప్లస్‌లు రద్దు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన హైస్కూల్‌ ప్లస్‌లను రద్దు చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హైస్కూల్‌ ప్లస్‌లలో సుమారు 1,450 మంది ఉపాధ్యాయులు పీజీటీలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుత సర్కారు వీటిని రద్దు చేయడంతో పీజీటీలను ఏం చేస్తారనే దానిపై స్పష్టత లేదు. వారికి బదిలీల్లో స్థానం కల్పిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

‘ప్రాథమికోన్నత’ పరిస్థితి ఏంటో ?

కూటమి ప్రభుత్వ విధానంలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలలు మూతపడనున్నాయి. దీంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్ల పరిస్థితిపై గందరగోళం నెలకొంది. వారిని బేసిక్‌ ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా నియమించే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లాలో సుమారు 400 మంది స్కూల్‌ అసిస్టెంట్లు మిగులు ఉపాధ్యాయులుగా మారతారు. వారిలో కొత్త విధానంలో ఏర్పడే సుమారు 300 మంది మోడల్‌ ప్రైమరీ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా నియామకాలు పొ ందినా మరో 100 మంది దాకా మిగిలిపోతారు. వారి పోస్టింగ్‌లపైనా స్పష్టత రావాల్సి ఉంది.

బదిలీలపై గందరగోళం

ప్రహసనంలా బదిలీల ప్రకటన

ఇప్పటికీ విడుదల కాని జీఓ

ఖాళీలు, మిగులు లెక్క తేలలేదు

యూపీలో పనిచేసే ఎస్‌ఏల సంగతేంటో?

1,450 మంది పీజీటీల భవిష్యత్‌ ప్రశ్నార్థకం

బదిలీలపై స్పష్టత ఇవ్వాలి

ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఉపాధ్యాయుల నుంచి అందిన సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని వాటికి అనుగుణంగా నిబంధనలు మార్చాలి. విద్యాశాఖ అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచిన సీనియార్టీ జాబితా తప్పుల తడకగా ఉంది. వెంటనే దానిని సరి చేసి పారదర్శకమైన జాబితాను ప్రకటించాలి. బదిలీల చట్టం ఎప్పటికప్పుడు సవరించేలా ఉండాలి. జీఓ 117ను రద్దు చేసి తీసుకురానున్న కొత్త జీఓలో పబ్లిక్‌, టీచర్‌ నిష్పత్తిని సవరించాలి.

– గెడ్డం సుధీర్‌, వైఎస్సార్‌ టీచర్స్‌

అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

హక్కులను కాలరాసేలా..

బదిలీల చట్టంలో ఉపాధ్యాయుల హక్కులను కాలరాసేలా ఉన్న 12,14 సెక్షన్లను వెంటనే రద్దు చేయాలి. బదిలీల నుంచి 70 శాతం డిజేబిలిటీ ఉన్న ఆర్థోపెడికల్లీ చాలెంజ్డ్‌ ఉపాధ్యాయులకు కూడా మినహాయింపు ఇవ్వాలి. ఉపాధ్యాయులు మొదటగా 3, 4 కేటగిరీల పాఠశాలలను మాత్రమే కోరుకోవాలి అనే సెక్షన్‌ను తొలగించాలి. సీనియార్టీ జాబితాలో ముందు వరుసలో ఉన్నవారికి ముందుగా 1, 2 కేటగిరీలు కోరుకునే అవకాశం కల్పించాలి.

– మద్దుకూరి ఆదినారాయణ, డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
గురువుల్లో గుబులు 1
1/2

గురువుల్లో గుబులు

గురువుల్లో గుబులు 2
2/2

గురువుల్లో గుబులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement