ముగింపు దశకు పెద్దింట్లమ్మ జాతర
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర ముగింపు దశకు చేరింది. ఈ నెల 1న ప్రారంభమైన జాతర గురువారంతో ముగియనుంది. ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ బుధవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి వస్త్ర, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాద దాతలుగా కైకలూరుకు చెందిన పోతునూరి మణికుమార్, తణుకు పట్టణానికి చెందిన ఉంగరాల కిషోర్, లక్ష్మీపురం గ్రామానికి చెందిన కాటూరి జగదీష్ వ్యవహరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కై కలూరుకు చెందిన కురేళ్ళ జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ గురువారం రాత్రి తెప్పోత్సవం జరుగుతోందని భక్తులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు.
ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
భీమవరం: నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కాకుండానే అడ్మిషన్లు, ప్రచారాలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణకు వినతిపత్రం అందజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బి.గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు తమ సిబ్బందిని ఇంటింటికీ పంపించి విద్యార్థుల అడ్మిషన్లపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. అటువంటి విద్యాసంస్థలపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎస్ లక్ష్మణ్, బి సింధు, భాగ్యలక్ష్మి తదితరులున్నారు.
క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని మోసం
భీమవరం: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి తనను మోసం చేశారని రేవు జగన్ మోహన్ అనే వ్యక్తి టూటౌన్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. జగన్‌మోహన్‌కు గత నెల 26న ఒక వ్యక్తి ఫోన్ చేసి కార్డుల లిమిట్ పెంచుతామని నమ్మించాడు. అది నమ్మిన జగన్ మోహన్ అతను పంపించిన లింక్‌ను క్లిక్ చేశాడు. దీంతో అతని అకౌంట్లో ఉన్న రూ.3,48,428 అగంతకుడు అకౌంట్లోకి వెళ్ళిపోవడంతో కంగుతిన్నాడు. టూటౌన్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలి
ఏలూరు (మెట్రో): జిల్లాలో గ్రామీణ అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రహదారి పనుల పురోగతిపై ఆమె సమీక్షించారు. అనంతరం జెడ్పీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు పురస్కారాలను అందజేశారు. జెడ్పీ సీఈవో కె.భీమేశ్వరరావు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ముగింపు దశకు పెద్దింట్లమ్మ జాతర
Comments
Please login to add a commentAdd a comment