భీమడోలు : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పులదండ వేసి అవమానపర్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం రాత్రి దళిత నాయకులు కొవ్వొత్తులు పట్టుకుని నిరసన తెలిపారు. తొలుత భీమడోలు సంత మార్కెట్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో దళిత నాయకుల పైడిమాల యుగంధర్, తుమ్మల శాంతభూషణం, గోగులమూడి రవికుమార్, మద్దాల వెంకటరత్నం, కాలి కిరణ్, రత్తయ్య, బెంజిమన్, డి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో..
ఏలూరు (టూటౌన్): అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక నరసింహారావుపేటలోని సంఘ కార్యాలయంలో శనివారం రాత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో అంబేడ్కర్‌ను అవమానించడం విచారించదగ్గ విషయం అన్నారు. దూబచర్ల వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. నాయకులు ఎన్.కార్తీక్, బి.నాగరాజు, పాము మాన్ సింగ్, అంబటి నాగేంద్ర, కె.మురళీ తదితరులు ఈ ఘటనను ఖండించారు.
దెందులూరు మండలంలో..
దెందులూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడంపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దెందులూరులో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఫారెస్ట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పల్లెం ప్రసాద్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గొల్ల కిరణ్, దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ కన్వీనర్ పొలిమేర హరికృష్ణ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తనగాల శేఖర్ తీవ్రంగా ఖండించారు. 48 గంటల్లో నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.