ఎక్కడ చూసినా ‘టు లెట్‌’ బోర్డులే ! | - | Sakshi
Sakshi News home page

ఎక్కడ చూసినా ‘టు లెట్‌’ బోర్డులే !

Published Wed, Jun 14 2023 12:06 PM | Last Updated on Wed, Jun 14 2023 3:34 PM

- - Sakshi

చౌటుప్పల్‌ : జాతీయ రహదారిపై దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో చౌటుప్పల్‌ ఒకటి. పలు మండలాలకు కూడలిగా ఉండడంతో పాటు ఎన్నో పరిశ్రమలకు కేంద్రంగా గుర్తింపు పొందింది. అటు నల్లగొండ, ఇటు హైదరాబాద్‌కు మధ్య ఉండడంతో శరవేగంగా అభివృద్ధి చెందింది. దీంతో గతంలో కుదించి ఉన్న పట్టణ కేంద్రం ఇప్పుడు నలుమూలలుగా విస్తరించింది. ఎటు చూసినా సుమారుగా రెండు కిలోమీటర్ల మేరకు ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. అయితే, పిల్లల చదువులు, ఉపాధి నిమిత్తం చాలా మంది హైదరా బాద్‌ బాట పట్టడంతో ఉరంతా ఖాళీ ఇళ్లే దర్శనమిస్తున్నాయి, ఎటు చూసినా టులెట్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి.

వ్యాపార, పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు
చౌటుప్పల్‌ మండలం వివిధ రకాల వ్యాపార, పారిశ్రామిక కేంద్రంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. 1990 సంవత్సరం నుంచే ఇక్కడ పరిశ్రమల శకం ప్రారంభమైంది. మండలంలోని చౌటుప్పల్‌, లింగోజిగూడెం, మల్కాపురం, పంతంగి, మందోళ్లగూడెం, ఎస్‌.లింగోటం, జైకేసా రం, అంకిరెడ్డిగూడెం, తూప్రాన్‌పేట, ఆరెగూడెం, కొయ్యలగూడెం, ధర్మోజిగూడెం, దేవలమ్మనాగారం, తంగడపల్లి, ఖైతాపురం, ఎల్లగిరి గ్రామాల్లో 100వరకు పరిశ్రమలు ఉన్నాయి. (హైదరాబాద్‌లో పెరిగిన ప్రాపర్టీల ధరలు)

నెలల తరబడి ఖాళీగా..
చౌటుప్పల్‌ గతంలో సింగిల్‌గానే ఉండేది. మరో నాలుగు గ్రా మాలైన లింగోజిగూడెం, తాళ్లసింగారం, తంగడపల్లి, లక్కారంతో కలిసి 2018లో మున్సిపాలిటీగా అవతరించింది. ఇందులో తంగడపల్లి, లక్కారం గ్రామాల్లో సగభాగం గత పదేళ్లుగా కలిసిపోయే ఉన్నాయి. మిగిలిన లింగోజిగూడెం, తాళ్లసింగారం దూరంగా ఉంటాయి. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో 8,030 నిర్మాణాలు(ఇండ్లు, దుకాణ సముదాయాలు) ఉన్నాయి. వీటిలో పట్టణ కేంద్రంతోపాటు కలిసిన గ్రా మాల్లోని ఇండ్లు కలిపి సుమారుగా 7వేల వరకు ఉంటాయి. అందులో దాదాపుగా 5వేల ఇండ్లు అద్దెలకు ఇస్తున్నవే ఉంటాయని అంచనా. ఇప్పడు ఈ ఇండ్లు చాలా మేరకు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ చూసినా టులెట్‌ బోర్డులే కనిపిస్తున్నాయి. నెలల తరబడి వేచి చూసినా కొత్త వారు రావడంలేదు. (అపుడు పాల ప్యాకెట్‌ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!)

నివాసానికి అనుగుణంగా..
మండలంతో పోలిస్తే పట్టణ కేంద్రం అన్ని రకా లుగా అందరికీ అనువుగా ఉంది. ఇక్కడికి మండలంతో పాటు నారాయణపురం, చండూరు, మునుగోడు, చిట్యాల, రామన్నపేట, వలిగొండ, పోచంపల్లి మండలాలకు చెందిన వివిధ వర్గాల ప్రజలు జీవనోపాధి పొందుతూ స్థానికంగానే నివాసం ఉంటున్నారు. వీరితోపాటు పరిశ్రమల్లో పనిచేసే వేలాదిమంది ఉద్యోగులు, కార్మికులు అత్యధికంగా ఇక్కడే నివసిస్తున్నారు. అద్దెకు వస్తున్న కుటుంబాల అభిరుచుల మేరకు చాలా మంది ఇంటి యజమానులు తమ ఇళ్లను ఒక అంతస్తు నుంచి ఐదు అంతస్తుల్లో అన్ని హంగులతో నిర్మించారు. ఏరియా డిమాండ్‌ మేరకు ఒక్కో గదికి 1000–2000వరకు, సింగిల్‌ బెడ్‌రూంకు 5వేల నుంచి 8వేల వరకు అద్దెలు ఉన్నాయి. రూ.లక్షలు వెచ్చించి చేపట్టిన నిర్మాణాల ద్వారా వచ్చే అద్దెలపైనే అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.

హైదరాబాద్‌కు మకాం మారుస్తున్న అత్యధిక కుటుంబాలు
గతంతో పోలిస్తే పట్టణంలో ఖాళీ ఇండ్ల సమస్య అత్యధికంగా ఉంది. రెండు దశాబ్దాల కాలంలో ఎప్పుడూ చూడని విధంగా నెలల తరబడి ఖాళీ ఇండ్లు ఇప్పుడు దర్శనం ఇస్తున్నాయి. ఆర్థికంగా ఓ స్థాయి కలిగిన కుటుంబాలు ఇక్కడి నుంచి మకాంను హైదరాబాద్‌కు మారుస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం పిల్లల విద్యాభ్యాసమేనని చెప్పవచ్చు. పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా చాలా వరకు ఈ ఏడాది ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. (మహీంద్రా థార్‌ దెబ్బకి రెండు ముక్కలైన ట్రాక్టర్‌? వైరల్‌ వీడియో)

పిల్లల చదువుల కోసమే ..
మాది ఇదే ఊరు. ఇక్కడే ఇళ్లు, వ్యవసాయ పొలాలు ఉన్నాయి. స్థానికంగా ఓ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నా. ప్రస్తుతం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా. రోజు ఇక్కడికి వచ్చి వెళ్తుంటా. స్థానికంగా అన్ని రకాలుగా ఆనందంగానే ఉన్నప్పటికీ సరైన విద్యాసంస్థలు అందుబాటులో లేవు. పిల్లల చదువుల కోసం ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది - సందగళ్ల నాగరాజు, చౌటుప్పల్‌

నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది
మాకు స్థానికంగా రెండు అంతస్తుల్లో ఇల్లు ఉంది. కొన్నేళ్లుగా కొంతభాగం అద్దెకు ఇస్తుంటాము. అద్దెకు ఉన్న వ్యక్తులు ఇల్లు ఖాళీ చేసి వెళ్తే తిరిగి అద్దెకు రావాలంటే చాలా రోజుల సమయం పడుతుంది. నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. దీంతో తమకు వివిధ రకాల చెల్లింపులకు ఇబ్బందిగా మారుతోంది.  –అవిరేను రమేష్‌, ఇంటి యజమాని, చౌటుప్పల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement