ఉపాధి ఉద్యోగుల సమ్మె సైరన్‌! | - | Sakshi
Sakshi News home page

ఉపాధి ఉద్యోగుల సమ్మె సైరన్‌!

Published Fri, Jan 31 2025 1:36 AM | Last Updated on Fri, Jan 31 2025 1:36 AM

ఉపాధి

ఉపాధి ఉద్యోగుల సమ్మె సైరన్‌!

రామన్నపేట : సమస్యల పరిష్కారం కోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం సిబ్బంది పోరుబాట పట్టనుంది. 14 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు బుధవారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. మండల పరిషత్‌ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేసి ఎంపీడీఓలకు వినతిపత్రాలు అందజేశారు. ఫిబ్రవరి 15వరకు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, పేస్కేల్‌ అమలు చేయాలని, లేనిపక్షంలో సమ్మెబాట పట్టనున్నట్లు తేల్చిచెప్పారు.

మూడు నెలలుగా వేతనాల్లేవ్‌..

జిల్లాలో ఏపీఓలు 15, ఈసీలు 13, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు 66, కంప్యూటర్‌ ఆపరేటర్లు 38, ఫీల్డ్‌ అసిస్టెంట్లు 265 విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. పిల్లల స్కూలు ఫీజులు, బ్యాంకు ఈఎంఐలు, ఇంటి అద్దెలు, నెలవారి పొదుపు చిట్టీలు చెల్లించడం కోసం దొరికిన చోటల్లా అప్పులు చేస్తున్నారు. నిత్యావసర సరుకులు కొనుగోలు దగ్గరి నుంచి రోజూ బస్సు చార్జీలు, పెట్రోలు ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు.

ఎన్నికల హామీ అమలు చేయాలని డిమాండ్‌

అధికారంలోకి వస్తే ఉపాధిహామీ ఉద్యోగులకు పే స్కేల్‌ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు పేస్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కార్యాచరణ ఇలా..

ఫిబ్రవరి 12వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగించాలని ఉపాధిహామీ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ నిర్ణయించింది. 29న నల్లబ్యాడ్జీలతో నిరసన, 30న తహసీల్దార్లు, ఎంపీడీఓలకు వినతిపత్రాలు అందజేత, 31న, ఫిబ్రవరి 1వ తేదీన పెన్‌డౌన్‌, 2న ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేత, శాంతియుత నిరసన, 4న కలెక్టర్‌కు విన్నపం, 5న కలెక్టరేట్‌ ఎదుట నిరసన, 6న టీఎన్‌జీఓ, టీజోవో ప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేస్తారు. 7న ప్రజాభవన్‌కు వెళ్లి వినతిపత్రాలు ఇవ్వడం, 8న హైదరాబాద్‌లో పీఆర్‌ అండ్‌ సీఆర్‌డీ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన, 12న కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేస్తారు.

నెలనెలా వేతనాలు, పేస్కేల్‌ అమలుకు డిమాండ్‌

ఫ ఫిబ్రవరి 12వరకు నిరసన కార్యక్రమాలు

ఫ ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెబాట

ఫ కార్యాచరణ రూపొందించిన ఉపాధిహామీ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ

సమ్మెకు వెళ్తే ఇబ్బందులే..

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో రాబో యే రెండు నెలలు కీలకం కానున్నాయి. లక్ష్యం చేరుకునేందుకు పనుల్లో వేగం పెంచాలని అధికారులు నిర్ణయించారు. దీంతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం గ్రామసభల్లో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటని ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంది. ఈ తరుణంలో ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు వెళితే పనులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం

మూడునెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నాం. ఉద్యోగం చేస్తూ అవసరాల కోసం ఇతరులను అప్పు అడగాల్సి వస్తుంది. చేతిలో చిల్లిగవ్వ లేక దారి ఖర్చులకు తెలిసిన వారి దగ్గర బదులు తీసుకోవాల్సి వస్తుంది. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి. ప్రతినెలా 1వ తేదీన వేతనాలు ఇవ్వాలి.

–ప్రవీణ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, రామన్నపేట

హామీ నిలబెట్టుకోవాలి

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉపాధిహామీ ఉద్యోగులకు పేస్కేల్‌ అమలు చేయాలి. అదే విధంగా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి. మూడు నెలల వేతనాలు వస్తలేవు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే విధంగా సంవత్సర కాలంగా అడ్మినిస్ట్రేటివ్‌ బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి.

–శ్రీలక్ష్మి, ఏపీఓల సంఘం జిల్లా అధ్యక్షురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
ఉపాధి ఉద్యోగుల సమ్మె సైరన్‌! 1
1/2

ఉపాధి ఉద్యోగుల సమ్మె సైరన్‌!

ఉపాధి ఉద్యోగుల సమ్మె సైరన్‌! 2
2/2

ఉపాధి ఉద్యోగుల సమ్మె సైరన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement