గుట్టకు ధర్మకర్తల మండలి! | - | Sakshi
Sakshi News home page

గుట్టకు ధర్మకర్తల మండలి!

Published Fri, Jan 31 2025 1:36 AM | Last Updated on Fri, Jan 31 2025 1:36 AM

గుట్టకు ధర్మకర్తల మండలి!

గుట్టకు ధర్మకర్తల మండలి!

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కసరత్తు

యాదగిరిగుట్ట: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ధర్మకర్తల మండలి ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బోర్డు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 29న హైదరాబాద్‌లో ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ, దేవాదాయశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. బోర్డులో ఉండే నియమనిబంధనలు, చేయాల్సిన పలు మార్పులపై సమీక్షించారు. రాజకీయాలకు తావు లేకుండా బోర్డు ఏర్పాటు చేయాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా, ఆధ్యాత్మికత పెంచేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ధర్మకర్తల మండలి ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి.

ధర్మకర్తల మండలి లేకుండానే..

తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ధర్మకర్తల మండలి లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధర్మకర్తల మండలి ఏర్పాటుపై అంతగా దృష్టి పెట్టలేదు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా వైటీడీఏ ఏర్పాటు చేశారు. వైటీడీఏకు సీఎం చైర్మన్‌గా ఉండగా, రిటైర్డ్‌ ఐఏఎస్‌ కిషన్‌రావును వైస్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. పదేళ్లుగా వైటీడీఏ ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు, ఆధ్యాత్మిక, పాలనాపరమైన కార్యకలాపాలు కొనసాగాయి.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత..

2024 మార్చిలో జరిగిన నృసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు, ఆ తరువాత నవంబర్‌లో తన పుట్టిన రోజు సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి యాదగిరి క్షేత్ర పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ఏర్పాటుపై ఆలయ అధికారులతో చర్చించారు. అనంతరం పలుమార్లు దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమై ధర్మకర్తల మండలి ఎలా ఏర్పాటు చేయాలి, ఎంత మందితో ఉండాలనే విషయాలపై ముసాయిదా రూపొందించారు. తాజాగా బుధవారం మరోమారు సీఎస్‌, దేవాదాయశాఖ అధికారులతో సమావేశమై యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఆశావహులు ఫుల్‌

ధర్మకర్తల మండలిలో స్థానం దక్కించుకునేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆశావహులు పోటీపడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. వారంతా ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే పదవుల కోసం కాకుండా స్వామివారి సేవలో, ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వ్యక్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ధర్మకర్తల మండలిలో స్థానికులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ తిరుమల తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు

ఫ ఫిబ్రవరిలో ప్రక్రియ పూర్తయ్యే అవకాశం

ఫ భారీగా ఆశావహులు, ప్రయత్నాలు ముమ్మరం

బోర్డులో ఉండేది ఎంతమంది?

నూతనంగా ఏర్పాటు చేయబోయే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డులో ఎంతమందికి చోటు కల్పిస్తారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తితో పాటు 9మంది ధర్మకర్తలు ఉండేవారు. ఆ సంఖ్యను 14 మందికి పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని, బోర్డు ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement