
జగన్మోహినిగా వెలిగి.. ఎదుర్కోలుకు కదిలి
శ్రీస్వామి, అమ్మవారిని ఊరేగింపుగా ఎదుర్కోలు మండపానికి తోడ్కొని వెళ్తున్న అర్చకులు, ఆలయ అధికారులు.. చిత్రంలో పట్టువస్త్రాలతో
కలెక్టర్ దంపతులు, ఈఓ
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో ఎదుర్కోలు మహోత్సవం శుక్రవారం రాత్రి వేదపండితుల మంత్రోచ్ఛరణలతో వీనులవిందుగా సాగింది. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణలతో అలంకరించిన శ్రీస్వామివారిని అశ్వవాహనంపై, అమ్మవారిని ముత్యాల పల్లకిపై అధిష్టింపజేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం తూర్పురాజగోపురం ఎదుట మాడ వీధిలో స్వామి వారిని పశ్చిమ ముఖంగా, అమ్మవారిని తూర్పుముఖంగా అధిష్టింపజేశారు. ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, అర్చకులు, ఇతర అధికారులు శ్రీస్వామి, అమ్మవారి తరఫున విడిపోయి పెద్దలుగా వ్యవహరించారు. ఇరువురి గుణగణాలు, ఆదాయం, వ్యయం, కట్నకానులకపై వివరించారు. అనంతరం తిరుకల్యాణ మహోత్సవానికి ముహూర్తం నిర్ణయించారు. అంతకుముందు ఉదయం శ్రీలక్ష్మీనరసింహుడు జగన్మోహిని అలంకారంలో ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
నేడు తిరుకల్యాణోత్సవం
లక్ష్మీసమేత నారసింహుడు శనివారం ఉదయం రామాలంకారంలో హనుమంత సేవపై దర్శనమిస్తారు. రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవపై కల్యాణమండపానికి బయలుదేరుతారు. 10 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

జగన్మోహినిగా వెలిగి.. ఎదుర్కోలుకు కదిలి
Comments
Please login to add a commentAdd a comment