చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో విచారణ చేస్తున్న కడప డీఎస్పీ ఎండీ షరీఫ్
కడప అర్బన్ : కడపలోని చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్న కప్పా రాజు (45) అనే వ్యక్తి ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటనపై విశ్వసనీయ సమాచారం మేరకు.. పోలీసు అధికారులు తెలిపిన వివరాలు, పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా లభించిన సీసీ ఫుటేజీల ఆధారాల ద్వారా తెలిసిన వివరాలిలా వున్నాయి. తూర్పుగోదావరి (ప్రస్తుతం కాకినాడ) జిల్లా ఏలేశ్వరానికి చెందిన కప్పారాజుకు ఆరు నెలల క్రితం మద్యం మాన్పించేందుకు వైద్యసేవలు అందించారు.
ఇతని మానసిక పరిస్థితి సరిగా లేదు. ఈ నెల 2న తన గ్రామం నుంచి కడపకు వెల్డింగ్ పని చేసేందుకు బయలుదేరి వచ్చాడని అతని కుమార్తె పోలీసులకు ఇచ్చిన సమాచారం. ఈక్రమంలో కడపకు చేరుకున్న రాజు పనులు చేస్తున్నాడు. ఇక్కడ తిరుపతి, వాసుదేవరాజులు పిలిస్తే తన తండ్రి వచ్చాడని, రెండు రోజుల నుంచి ఆయన ఫోన్ పనిచేయలేదని తెలియజేసింది. ఈనెల 5వ తేదీ (శనివారం అర్ధరాత్రి) చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అశోక్‌నగర్‌లో ఎద్దుల బాబు అనే వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లి రాజు గేటు తెరిచాడు. తరువాత ఆ ఇంటి ఆవరణలోని కూలర్‌ను పగులగొట్టాడు. ఈక్రమంలోనే ఇంటి వాకిలిని బలవంతంగా తెరిచాడు.
ఇంటివాళ్లు గమనించి యజమానికి ఫోన్ చేశారు. తరువాత జనాలు గుమికూడి డయల్ 100కు 1:20కి కాల్ చేశారు. బ్లూకోల్ట్స్ 10కు సంబంధించిన పోలీసులు 1:26కు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అతన్ని చిన్నచౌక్ పోలీసులకు అప్పగించారు. పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. రాజు తనది నెల్లూరని, మతిస్థిమితం సరిగాలేని విధంగా ప్రవర్తించాడు. తరువాత అతనికి నీళ్లు ఇచ్చారు. రాత్రి పోలీస్‌స్టేషన్‌లోనే నిద్రించాడు. లాకప్‌లో ఉన్న రాజు ఉదయం 8:51 గంటలకు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. 9:20కి గమనించిన మహిళా కానిస్టేబుల్.. మరో కానిస్టేబుల్‌కు తెలియజేసింది. విధుల్లో ఉన్న సిబ్బంది వచ్చి రాజుకు సీపీఆర్ చేశారు.
తరువాత వెంటనే ఆర్‌ఎంపీని పిలిపించి ప్రథమ చికిత్స అందించారు. వెంటనే ఆటోలో కడప రిమ్స్‌కు తరలించారు. అప్పటికే రాజు మృతి చెందాడని రిమ్స్ వైద్యులు నిర్ధారించారు. అతని ప్యాకెట్‌లో దొరికిన ఐడీ, ఆధార్ కార్డుల ఆధారంగా చిరునామాను గుర్తించారు. అతని కుమార్తె రాజేశ్వరికి సమాచారం ఇచ్చారు. ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అతని బంధువులు వచ్చిన తరువాత వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలియజేశారు.
సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ ఎం.డి. షరీఫ్ పరిశీలించారు. కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీరామశ్రీనివాసులు, ఎస్‌ఐ రవికుమార్, సిబ్బందిని విచారణ చేశారు. ఈ సంఘటనపై సమగ్రంగా విచారణ చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ మార్చురీలో ఉంచారు.
అనారోగ్యంతో మృతి : డీఎస్పీ
చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్న మతిస్థిమితం లేని కప్పా రాజు అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడని డీఎస్పీ ఎం.డి. షరీఫ్ తెలిపారు. కడప రిమ్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 5న రాత్రి అశోక్‌నగర్‌కు చెందిన ఎద్దుల బాబు డయల్ 100కు ఫోన్ చేసి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తలుపు బలవంతంగా తీసి చొరబడేందుకు ప్రయత్నించాడని పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు.
అతన్ని చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వచ్చారని, నైట్ డ్యూటీలో వున్న సీఐ శ్రీరామశ్రీనివాసులు వచ్చి విచారణ చేశారని పేర్కొన్నారు. రాజు ఆదివారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌లో అపస్మారక స్థితిలో వుండగా మహిళా కానిస్టేబుల్ గమనించి సిబ్బందికి తెలియజేసిందన్నారు. తరువాత వారు ఆర్‌ఎంపీని పిలిపించి చూపించారన్నారు.
తరువాత రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడన్నారు. పోలీస్‌స్టేషన్‌లో చనిపోవడంతో కస్టోడియల్ డెత్ కింద ఆర్డీఓ ద్వారా బంధువుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించేందుకు సిఫారసు చేశామన్నారు. అతని బంధువుల ఫిర్యాదు మేరకు సమగ్రంగా విచారణ చేస్తామన్నారు. ఈ సమావేశంలో కడప రిమ్స్ సీఎస్ సీఐ రామచంద్ర, చిన్నచౌక్ సీఐ శ్రీరామ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment