ఎర్రగుంట్ల/ప్రొద్దుటూరు: మదినిండా భక్తితో..తాము నమ్ముకున్న దైవానికి కోరికలు విన్నవించి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ ప్రార్థనకు బయలుదేరిన వారిని రోడ్డుప్రమాద రూపంలో మృత్యువు వెంటాడంతో మరలిరాని లోకాలకు వెళ్లారు. దయనీయమైన ఈ సంఘటన సోమవారం ఎర్రగుంట్ల మండలంలో జరిగింది. ఆటోను బస్సు ఢీకొనండంతో నలుగురు దుర్మరణం చెందగా..10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని ఆజాద్ నగర్ కాలనీకి చెందిన మైనార్టీలు పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కడపలో నివాసం ఉండే మహచాన్, మాహబూబ్‌బాషా, హసీన, నఫీసా, బీబీజాన్‌లు కుటుంబీలకుతో కలసి తొండూరు మండలంలోని మల్లేల గ్రామంలో ఉన్న మసీద్‌కు వెళ్లడానికి ఆటోలో కడప నుంచి బయలు దేరారు. వీరు ప్రొద్దుటూరులోని పెన్నాగనర్, సుబ్బిరెడ్డినగర్‌కాలనీలలో ఉన్న వారి బంధువులను కూడా పిలుచుకెళ్లడానికి మైదుకూరు మీదుగా ప్రొద్దుటూరుకు వచ్చారు.
ప్రొద్దుటూరులోని ఎస్ కమాల్‌బాషా, జాఖీర్, అమీనా, షేఫ్వీన్‌లను ఎక్కించుకున్నారు.మల్లేల మసీద్ వద్ద ప్రార్థనలు చేసుకోవడానికి ఆటోలనే అన్నం, కూరలు, తినుబండరాలను తీసుకుని బయలు దేరారు. వీరిని మృత్యువు వెంటాడింది. ఎర్రగుంట్ల పట్టణంలోని ప్రొద్దుటూరు మార్గంలో ఉన్న ఎస్వీ కల్యాణ మండపం వద్దకు రాగానే ముందు వెళతున్న లారీనీ క్రాస్ చేస్తుండుగా పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో సయ్యద్ మహబూబ్ బాషా (30), సయ్యద్ హసీనా (26), అమీనా (28), షేక్ షాకీర్‌బాషా (13)లు అక్కడిక్కడే మృతి చెందారు.
మిగిలిన వారిలో ఎస్ అయిషా(4), ఎస్ అసిఫా (6), షేక్ కమాల్‌బాషా (15), షేక్ జూబీస్(15), షేక్ నఫీసా(38), షేక్ నస్రీన్ (13), షేక్ మహచాన్ (50), షేక్ జాకీర్ (12), సయ్యద్ బీబీజాన్ (67), షేక్ షేఫ్వీన్ (35)లు తీవ్రంగా గాయపడ్డారు.. ఈ దుర్ఘటనతో రహదారి అంతా రక్తసిక్తమైంది. ఆటో నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ మార్గంలో వెళుతున్న స్థానికులు గాయపడిన వారిని ప్రత్యేక ప్రైవేట్ వాహనాల్లో చికిత్స కోసం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఎర్రగుంట్ల పట్టణ సీఐ ఈశ్వరయ్య , ఎస్‌ఐ ప్రవీణకుమార్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎర్రగుంట్ల తహసీల్దార్ నాగేశ్వరరావు విషయాన్ని జిల్లా కలెక్టర్ విజయరామరాజుకు తెలియజేశారు.
దర్గాకు వెళ్లాలని అక్క ఇంటికి వచ్చారు..
ప్రొద్దుటూరులోని పెన్నానగర్‌కు చెందిన షేక్ మహబూబ్‌బాషా కూరగాయాల మార్కెట్‌లో గుమాస్తాగా పని చేస్తున్నాడు. అతనికి భార్య షఫివున్,షాకీర్, జాకీర్, కమాల్‌బాషా అనే ముగ్గురు కుమారులున్నారు. అతని బావమరిది సయ్యద్ మహబూబ్‌బాషా కడపలోని ఆజాద్‌నగర్‌లో ఉంటున్నాడు, అతను కుటుంబ సభ్యులతో కలిసి మల్లేల ఇమాంబి దర్గాకు వెళ్లేందుకు ఆదివారం ప్రొద్దుటూరుకు వచ్చాడు.
అందరూ కలసి అక్క ఇంట్లో సరదాగా గడిపారు. సోమవారం ఉదయం మల్లేల ఇమాంబి దర్గాకు వెళ్లాలని చర్చించుకున్నారు. ఈ మేరకు రాత్రి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రొద్దుటూరులోనే ఒక ఆటోను బాడుగకు మాట్లాడుకొని అందులో వెళ్తుండగా ఎర్రగుంట్ల సమీపంలోకి వెళ్లగానే ఆటో ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో కడపకు చెందిన సయ్యద్ మహబూబ్‌బాషా, అతని భార్య హసీనా, ప్రొద్దుటూరులోని షేక్ మహబూబ్‌బాషా కుమారుడు షాకీర్‌బాషా, ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన అమీనా మృతి చెందారు. అమీనా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదించసాగారు.
► రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి సోమవారం జిల్లా ఆస్పత్రికి వచ్చి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయవాడలో ఉన్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఆర్టీసీ, టిప్పర్ డ్రైవర్లపై కేసు నమోదు
రోడ్డు ప్రమాద ఘటనపై విచారణ జరిపి ఆర్టీసీ డ్రైవర్, టిప్పర్ డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్య సోమవారం తెలిపారు.
అజాద్‌నగర్‌లో విషాదం
కడప అర్బన్/చింతకొమ్మదిన్నె: కడపలోని ఆజాద్‌నగర్‌కు చెందిన మహబూబ్‌బాషా ఐటీఐ సర్కిల్ సమీపంలో కార్పెంటర్‌గా విధులు నిర్వహించేవాడు. అతనితో పాటు భార్య హసీనా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.ప్రమాదంలో మరణించి శవాలుగా మారి ఇంటికి రావడాన్ని ఆ ప్రాంతంలోని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఒకే కుటుంబంలోని భార్యాభర్తలు ఇద్దరు మృత్యువాత పడటం, వారి బంధువులు క్షతగాత్రులుగా మారి ఆసుపత్రుల్లో చికిత్స పొందటంతో ఆజాద్‌నగర్‌లో విషాదం నెలకొంది. భార్యాభర్తల మృతదేహాలకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కడపలోని ఇందిరానగర్‌కు చెందిన హసీనాను రెండేళ్ల క్రితమే మహబూబ్‌బాషాకు ఇచ్చి వివాహం చేశారు. వారు చాలా అన్యోన్యంగా ఉండేవారనీ, ఇలా మృత్యువాత పడటంతో ప్రతిఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment