మదనపల్లె: అన్నమయ్యజిల్లా మదనపల్లె మండలం బార్లపల్లె వద్ద ఆదివారం రాత్రి ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో స్కార్పియో వాహనాన్ని వేగంగా నడుపుతూ.. ఎదురుగా వస్తున్న రెండుకార్లు, రోడ్డుపై నిల్చున్న ఇద్దరు రైతులను ఢీకొని, అదుపుచేయలేని స్థితిలో లారీని ఢీకొని, ఐదుగురిని మృత్యువాతపడేలా చేసిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాదతీవ్రతకు స్కార్పియో వాహనం నుజ్జునుజ్జు కావడంతో పాటుగా డ్రైవర్ తల ఎగిరి మొండెం కిందపడింది. వాహనంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కడప–బెంగళూరు జాతీయరహదారిపై మదనపల్లె మండలం బార్లపల్లె వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాద ఘటన షాక్‌కు గురిచేసింది. ప్రమాదం జరిగిన తీరు, మృతదేహాలు చిధ్రమైన వైనం, వాహనం నుజ్జునుజ్జు చూస్తుంటే.. మృత్యువు దూసుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురు మదనపల్లెకు చెందినవారే కావడం బాధాకరం. ఘటనకు సంబంధించిన వివరాలు..
మదనపల్లె పట్టణం దేవతానగర్‌కు చెందిన చలపతి కుమారుడు సుంకరవిక్రమ్(38) అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ 8నెలల క్రితం తిరిగి వచ్చాడు. స్థానికంగా తిరిగేందుకు ఏపీ–39, ఎన్‌జే–8439 స్కార్పియో వాహనాన్ని కొనుగోలు చేశాడు. అమ్మచెరువుమిట్టకు చెందిన ఆటోడ్రైవర్ మల్లికార్జున కుమారుడు తిలక్(19) స్థానికంగా ఓ డిగ్రీ కళాశాలలో మొదటిసంవత్సరం చదువుతున్నాడు. తట్టివారిపల్లెకు చెందిన చిన్నరెడ్డెప్ప కుమారుడు శ్రీనాథ్(25) ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్నాడు. రామారావుకాలనీకి చెందిన చరణ్‌కుమార్(25), హరీష్(33), మహేష్(31)లు స్నేహితులు. వీరు ఆరుగురు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలవరకు మదనపల్లెలోనే ఉన్నారు. తర్వాత మద్యం తాగుందుకు కర్ణాటకకు వెళ్లాలని నిర్ణయించుకుని విక్రమ్‌ను స్కార్పియో వాహనం తీసుకురమ్మని కోరారు. వాహనంలో ఆరుగురు కలిసి కర్ణాటకకు వెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు మద్యంతాగి మదనపల్లెకు బయలుదేరారు.
కర్ణాటక సరిహద్దు చెక్‌పోస్ట్‌లో బారికేడ్లను ఢీకొన్నారు. అక్కడ పోలీసులు తమను పట్టుకుంటారేమోనన్న భయంతో వాహనాన్ని వేగంగా నడుపుతూ, ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు. అలాగే వస్తూ..మరో కారు సైడ్‌మిర్రర్‌ను ఢీకొని, వేగంగా ప్రయాణిస్తున్నారు. అదేసమయంలో చీకలబైలు పంచాయతీ కోళ్లవారిపల్లెకు చెందిన కరమల సుబ్రహ్మణ్యం ఆచారి అలియాస్ కాళిదాసు(55), యల్లుట్ల చంద్రప్ప(50) బార్లపల్లె పాలడిపోలో పాలుపోసి, రోడ్డుపై నిల్చున్నారు. వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం రోడ్డుకు అటువైపు నిల్చున్న వీరిద్దరినీ ఢీకొంది. వాహనం ఢీకొన్న ధాటికి రైతులు ఇద్దరూ ఎగిరి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో స్థానికులు అరుపులు, కేకలు వేయడంతో ఆందోళన చెందిన విక్రమ్ స్కార్పియో వాహనాన్ని మరింత వేగం పెంచాడు.
మితిమీరిన వేగంలో వాహనాన్ని అదుపుచేయలేక, వెనుక పరిగెత్తుకుని వస్తున్న వ్యక్తులను గమనిస్తూ, ఏమరుపాటులో ఎదురుగా వస్తున్న బోరుసామగ్రి తరలించే లారీని ఢీకొన్నాడు. దీంతో స్కార్పియో గాల్లోకి ఎగిరిలేచింది. టాప్ ఎగిరిపోయి కిందపడ్డ దెబ్బకు డ్రైవర్ విక్రమ్ తల తెగి మొండెం కిందపడింది. వాహనంలో ఉన్నటువంటి తిలక్, శ్రీనాథ్ అక్కడికక్కడే మృతిచెందారు. చరణ్‌కుమార్, హరీష్, మహేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో తాలూకా సీఐ ఎన్.శేఖర్, 108 సిబ్బందిని అప్రమత్తం చేసి క్షతగాత్రులను హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో చరణ్‌కుమార్, హరీష్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు రెఫర్ చేశారు. మహేష్ మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు.
క్షణకాలంలో ఘోర ప్రమాదం
రాత్రి 7.40 గంటల సమయం. పల్లె ప్రశాంతంగా ఉన్న సమయంలో రోడ్డుపై దూసుకొచ్చిన ఓ వాహనం లారీని ఢీకొని గాల్లోకి ఎగిరి అందులోని వ్యక్తులు చెల్లాచెదురుగా కిందపడిన వైనం ఒక్కసారిగా భయాన్ని కల్పించిందని ప్రత్యక్షసాక్షి, బార్లపల్లె గ్రామస్తురాలు పద్మావతి తెలిపారు. స్కార్పియో వాహనం వేగంగా రావడం చూసిన తాను ఎక్కడ ఢీకొడుతుందోనని, ముందుగానే లారీని మార్జిన్‌లో నిలిపేశానని, అయితే దూసుకొచ్చి మరీ ఢీకొని గాల్లోకి లేచిందని తమిళనాడుకు చెందిన బోరు లారీ డ్రైవర్ దినేష్ చెప్పుకొచ్చాడు. కళ్లముందే ముగ్గురి ప్రాణాలు ఘోరంగా పోవడం తనను కలిచివేసిందని, షాక్ నుంచి తేరుకోలేకపోయానని భయపడుతూ చెప్పాడు. ప్రమాదంలో పేద కుటుంబాలకు చెందిన రైతులు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment