వారు ఎంతో అన్యోన్యంగా జీవించారు. ఒకరంటే మరొకరికి ప్రాణం. మృత్యువులోనూ వారి జీవిత అను‘బంధం’ కొనసాగింది. హృదయ విదారకమైన ఈ సంఘటనలు ఒకే రోజు రెండు చోటుచేసుకున్నాయి. వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరు మండలం గంజికుంట గ్రామంలో అన్నను కడసారి చూసేందుకు వస్తున్న తమ్ముడు.. రోడ్డు ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అనారోగ్యంతో తనయుడు మృతి చెందడంతో.. తల్లడిల్లిన తల్లి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఈ ఘటనలతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
వైఎస్సార్: తనయుడి మృతితో తల్లి తనువు చాలించిన ఘటన గురువారం మదనపల్లె పట్టణంలో జరిగింది. నీరుగట్టువారిపల్లె రామిరెడ్డిలేఔట్ వరసిద్ధి వినాయకస్వామి గుడి వద్ద నివాసం ఉంటున్న రమణయ్య భార్య కె.లక్ష్మీదేవి(60)కి పదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ముగ్గురు కుమారులు. పెద్దకొడుకు ఆరు నెలల వయసులో చనిపోగా, రెండో కుమారుడు వెంకటరమణ పదమూడేళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందాడు. చివరివాడైన నాగభూషణం(38)తో కలిసి తల్లి ఉంటోంది. నాగభూషణం చేనేత కార్మికుడు కాగా, అతడికి భార్య కుమారి, ఇద్దరు సంతానం ఉన్నారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగభూషణం ఆరునెలల క్రితం బెంగళూరు సెయింట్‌జాన్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు.
అనంతరం ఇంటివద్దే ఉంటున్నాడు. ఈక్రమంలో మూడురోజుల క్రితం నాగభూషణంకు విషజ్వరం తీవ్రమై పరిస్థితి విషమించింది. బుధవారం బెంగళూరు ఆస్పత్రిలో చేరి గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డల్లో.. చివరివాడైనా మిగిలాడనుకున్న తల్లి లక్ష్మీదేవి, అతడు చనిపోయాడన్న విషయం తెలుసుకుని తీవ్ర మనోవేదనతో తల్లడిల్లింది. బిడ్డ లేని బతుకు తనకు ఎందుకంటూ కొడుకు చనిపోయిన గంటల వ్యవధిలోనే.. సాయంత్రం 4 గంటలకు తన ఇంటి బాత్‌రూమ్‌లో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్సలు పొందుతూ సాయంత్రం 6.30 గంటలకు మృతి చెందింది. ఒకే కుటుంబంలో తల్లి, కొడుకు గంటల వ్యవధిలో చనిపోవడంపై విషాదం నెలకొంది. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి లక్ష్మీదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
మైదుకూరు : ఒకే తల్లి కడుపున పుట్టిన రక్తసంబంధం వారిది. అన్న కంటే నాలుగేళ్ల తర్వాత తమ్ముడు జన్మించినా.. వయసులో తేడాలే తప్ప విడదీయలేని అనుబంధం వారిది. వారి అన్యోన్యతను చూసి విధికి కన్ను కుట్టిందేమో.. తమ్ముడి మరణ వార్త విని కడసారి చూసేందుకు వస్తున్న అన్ననూ మృత్యువు కబళించింది. పెళ్లీడుకొచ్చిన కొడుకుల అచ్చట ముచ్చట తీర్చక ముందే.. తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. విషాదకరమైన ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మండలంలోని గంజికుంటకు చెందిన పాములేటి రాజా, నాగలక్ష్మి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. కుమార్తెకు వివాహం కాగా, పెద్ద కుమారుడు నరేంద్ర కుమార్ (29) కులవృత్తితోపాటు వ్యవసాయం చేసుకుంటూ ఇంటి వద్దే ఉన్నాడు. డిగ్రీ చదువుకున్న రెండవ కుమారుడు రాజేష్ కుమార్ (25) హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. గురువారం ఉదయం రాజా, పెద్ద కుమారుడు నరేంద్ర పొలం వద్దకు వెళ్లారు. సాగు చేసిన మినుము పంటకు నీరు కట్టేందుకు నరేంద్ర మోటార్ స్టార్టర్ బటన్ ఆన్ చేయగా.. విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నరేంద్ర మృతి చెందిన విషయాన్ని హైదరాబాద్‌లో ఉంటున్న అతని తమ్ముడు రాజేష్ కుమార్‌కు తెలిపారు. హైదరాబాద్ నుంచి రాజేష్ బైక్‌పై బయల్దేరాడు. షాద్‌నగర్ వద్ద అదుపు తప్పి బైక్‌పై నుంచి రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కడుపున పుట్టిన బిడ్డలు ఇద్దరూ ఒకే రోజు మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రుల దుఃఖం కట్టలు తెంచుకుంది. గంజికుంట గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో విషాదం నెలకొంది.
మైదుకూరు అర్బన్ ఏఎస్‌ఐ చంద్రమౌళి కేసు నమోదు చేసుకుని నరేంద్ర కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. షాద్‌నగర్ వద్ద జరిగిన సంఘటనలో మృతి చెందిన రాజేష్ కుమార్ మృతదేహానికి హైదరాబాద్‌లో ఉన్న రాజా బంధువులు పోస్టుమార్టం చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment