నేడు వైవీయూ నూతన వీసీ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

నేడు వైవీయూ నూతన వీసీ బాధ్యతల స్వీకరణ

Published Mon, Feb 24 2025 12:18 AM | Last Updated on Mon, Feb 24 2025 12:17 AM

నేడు

నేడు వైవీయూ నూతన వీసీ బాధ్యతల స్వీకరణ

కడప ఎడ్యుకేషన్‌: యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య ఫణితి ప్రకాష్‌ బాబు సోమవారం ఉదయం 10 గంటలకు వీసీ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లోని స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ బయోటెక్నాలజీ అండ్‌ బయోఇన్ఫర్మేటిక్స్‌ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ గా ఉన్న ఫణితి ప్రకాష్‌ బాబును వైవీయూ వీసీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి ఈ నెల 18వ తేదీన జి ఓ ఎం ఎస్‌ నెంబర్‌ 6 ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు విశ్వవిద్యాలయం ఏర్పాట్లు పూర్తి చేసింది. బాధ్యతల స్వీకరణ అనంతరం ప్రిన్సిపాల్స్‌, డీన్‌లు, వివిధ విభాగాల డైరెక్టర్లు, అధ్యాపకులు, సిబ్బందితో విడివిడిగా సమావేశం కానున్నారు.

నేడు ప్రజా ఫిర్యాదుల

పరిష్కార వ్యవస్థ

కడప సెవెన్‌రోడ్స్‌: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం కలెక్టరేట్‌ సభాభవన్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్‌ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్‌ కార్యాలయాలలో కూడా సమర్పించుకోవచ్చన్నారు.

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి 10.00 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562–244437 ల్యాండ్‌ లైన్‌ నంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌ఓ కోరారు.

వీరభద్రుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

రాయచోటి టౌన్‌: రాయచోటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి(రాచరాయుడు) బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో కంకణధార నిర్వహించారు. అనంతరం గుడిలో ఉన్న బావి నుంచి గంగను తీసుకొచ్చారు. కలశాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత వీరశైవుల విన్యాసాలతో స్వామి వారి ధ్వజారోహణం నిర్వహించారు. రాత్రి పాత రాయచోటిలోని అగస్తేశ్వర స్వామి ఆలయం నుంచి మట్టి సేకరణతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది.

ఇంటర్‌ పరీక్షలను

పకడ్బందీగా నిర్వహించాలి

కడప ఎడ్యుకేషన్‌: జిల్లా వ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించి జిల్లాకు మంచిపేరు తేవాలని ఇంటర్మీడియట్‌ ఆర్‌జేడీ రవి సూచించారు. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల విధి విధానాలపై ఆదివారం కడప మరియాపురం సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాల సెమినార్‌ హాలులో చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్‌ ఆఫీసర్లు, కస్టోడియన్లు, అడిషనల్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లకు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని మౌలిక వసతులను కల్పించాలన్నారు. ఇంటర్‌ ఆర్‌ఐఓ బండి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఏదైనా సమస్య ఉంటే 08562–244171 నెంబర్‌కు ఫోన్‌ చేసి తగిన సహాయం పొందాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈసీ సభ్యులు వెంకటసుబ్బయ్య, రామిరెడ్డి, శివహరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేడు వైవీయూ నూతన  వీసీ బాధ్యతల స్వీకరణ 1
1/1

నేడు వైవీయూ నూతన వీసీ బాధ్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement