ప్రొద్దుటూరు క్రైం : ఓ బాలుడు బ్లేడ్‌తో గొంతు కింద కాటు పెట్టుకున్నాడు. తనపై హత్యా యత్నం జరిగిందని బంధువులపై నెట్టే ప్రయత్నం చేశాడు. చివరకు అసలు విషయం తెలియడంతో పోలీసుల వద్ద అడ్డంగా బుక్కయ్యాడు. ప్రొద్దుటూరుకు చెందిన 17 ఏళ్ల బాలుడు చికెన్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. అతను మైదుకూరుకు చెందిన 15 ఏళ్ల బాలికను కొన్ని రోజుల నుంచి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలిసింది. వేధిస్తున్న విషయం బాలుడి సమీప బంధువుకు చెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. తర్వాత బాలిక బంధువులు బాలుడిని మందలించారు. అది మనసులో పెట్టుకున్న బాలుడు వారిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని భావించాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అతను బ్లేడ్‌తో గొంతు కింద చిన్నపాటి కాటు పెట్టుకున్నాడు. అతనే జిల్లా ఆస్పత్రిలో చేరాడు. బాలిక బంధువులే తన గొంతు కోసి చంపే ప్రయత్నం చేశారని ఔట్‌పోస్టులో ఫిర్యాదు కూడా చేశాడు. బాలుడి గాయం గురించి రూరల్ పోలీసులు డాక్టర్‌తో మాట్లాడారు. చిన్నపాటి గాయమేనని, చర్మం పై భాగంలోనే బ్లేడ్ కాటు ఉన్నట్లు చెప్పారు. బాలుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో రూరల్ ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ గట్టిగా విచారణ చేశారు. బాలుడితో మాట్లాడటంతో అసలు నిజం బహిర్గతమైంది. తనపై ఎవరూ హత్యా యత్నం చేయలేదని, తానే గొంతు కింద బ్లేడ్‌తో కోసుకున్నట్లు అతను పోలీసుల వద్ద అంగీకరించాడు. బాలిక బంధువులను బెదిరించాలనే ఈ పని చేసినట్లు చెప్పుకొచ్చాడు. తన కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ బాలుడిని మందలించారు. పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment