ఫిర్యాదుల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కడప ఎడ్యుకేషన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఎవరైనా తమ ఫిర్యాదులను తెలియజేసేందుకు, సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించినట్లు పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శ్యాముల్ తెలిపారు. ఇందులో ఆర్‌జేడీ కార్యాలయ సూపరింటెండెంట్ బాబానాయక్ (9441683500), జయసూర్య (7358302380) లను నియమించినట్లు తెలిపారు. ఏవైనా ఫిర్యాదులుంటే వీరి నంబర్లకు కాల్ చేసి తెలియ చేయవచ్చని ఆర్‌జేడీ తెలియ చేశారు.
రేపు ‘స్పర్ష్ అవుట్ రీబ్’ ప్రోగ్రాం
కడప రూరల్: కడపలోని జిల్లా సైనిక సంక్షేమ భవనం దగ్గర ఈ నెల 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘స్పర్ష్ అవుట్ రీబ్’పోగ్రాంను జిల్లాలోని మాజీ సేనికులు వారి కుటుంబ సభ్యలు సద్వినియోగం చేసుకోవాలని లీగ్ జిల్లా అధ్యక్షులు జడ్ ఫిలిప్స్ తెలిపారు. ఈ సందర్భంగా స్పర్ష్, ఈసీహెచ్‌ఎస్, కేఎస్పీ, డిజేబులిజీ పెన్షన్‌తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
రేపు ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ సిబ్బంది విధుల బహిష్కరణ
కడప రూరల్: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పని చేస్తున్న వైద్య మిత్రలు ఇతర సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న కడపలోని జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయం ఎదుట విధులను బహిష్కరించి..నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా యూనియన్ అధ్యక్షుడు సి. విజయ్, జాయింట్ సెక్రటరీ సుబ్బరాజు తెలిపారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా 24వ తేదీన కడపలోని జిల్లా కో–ఆర్డినేటర్ కార్యాలయం ఎదుట, 27వ తేదీన మంగళగిరిలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన..విధుల బహిష్కరణ కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలిపారు. సిబ్బంది ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు.
వైభవం.. పుష్పయాగం
గుర్రంకొండ: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం ఉద యం తోమాలసేవ, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం సుదూర ప్రాంతాల నుంచి రంగురంగుల పుష్పాలను తెప్పించి గ్రామోత్సవం నిర్వహించారు. వాటితో స్వామివారిని అందంగా అలంకరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పుష్పయాగం నిర్వహించారు. స్వామివారికి అలంకరించిన పుష్పాలను అర్చకులు భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ఏపీపీఎస్‌సీ పరీక్షలు
పకడ్బందీగా నిర్వహించాలి
కడప సెవెన్‌రోడ్స్: ఈ నెల 16, 17 తేదీల్లో జరగనున్న ఏపీపీఎస్‌సీ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 మధ్యాహ్నం 12.00 గంటల వరకు , తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 గంటల వరకు ఈ పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా చూడాలన్నారు. లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెంట్లు, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలోని సీకే దిన్నె మండల పరిధిలో నాలుగు, చాపాడులో ఒకటి, ప్రొద్దుటూరులో ఒక కేంద్రం కలిపి మొత్తం ఆరు పరీక్షా కేంద్రాలు ఉంటాయని, ప్రతి కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఏపీపీఎస్‌సీ పరీక్షల జిల్లా ప్రత్యేక అధికారులు ఎండీ బాబర్, ఎ.శివనారాయణరెడ్డి, లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
ఫిర్యాదుల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment