కడప కార్పొరేషన్ : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ సీఎం చంద్రబాబుకు తొత్తు అని వైఎస్సార్‌సీపీ నేత, సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ ఛైర్మన్ పులి సునీల్ కుమార్ విమర్శించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల మందక్రిష్ణ మాదిగ వర్గీకరణ అంశంపై మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వేలెత్తి చూపేలా మాట్లాడటం సరికాదన్నారు. వర్గీకరణ అంశం ముందుకు పోవడానికి వైఎస్సార్ సహకరించారని, ఆయన అకాల మరణం తర్వాత అది మరుగున పడిందని మాట్లాడిన నోటితోనే రాజకీయ నాయకులను మించి విమర్శలు చేయడం దారుణమన్నారు. వర్గీకరణ చేయమని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని అడక్కుండా, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్‌ను కోరడం సరికాదన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వైఎస్సార్‌సీపీ స్పష్టంగా చెప్పినప్పటికీ మళ్లీ వైఖరి చెప్పాలనడం విచిత్రంగా ఉందన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని గతంలో చంద్రబాబు అన్నప్పుడు, ఎస్సీలు స్నానం చేయరు, శుభ్రంగా ఉండరు అని ఆయన మంత్రులు మాట్లాడినప్పుడు మందక్రిష్ణ మాదిగ కనీసం ఖండించలేదన్నారు. ఆయన వర్గీకరణపై తప్పా దళితుల సమస్యలు, వారి ఇబ్బందుల గూర్చి ఏనాడు పోరాడలేదన్నారు. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెప్పు కోసం వైఎస్ జగన్‌ను ఇరుకునపెట్టేలా మాట్లాడారన్నారు. వైఎస్ జగన్ మాదిగల పక్షపాతిగా ఎస్సీల్లో మూడు వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, మాదిగలకు మంత్రి పదవులు, కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులు ఇచ్చారన్నారు. ఇప్పుడు మాదిగలకు చంద్రబాబు ఎన్ని పదవులు ఇచ్చారో బేరీజు వేయాలన్నారు. గతంలో అన్ని ప్రభుత్వాలు మాదిగలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నాయని, ఒక్క వైఎస్ జగన్ మాత్రమే వారికి మేలు చేశారని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి త్యాగరాజు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, రవి తదితరులు పాల్గొన్నారు.
సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్
పులి సునీల్ కుమార్