క్షయ నియంత్రణ పేరుతో.. కోట్లు మింగేశారు !
కడప రూరల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ నియంత్రణకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నాయి. అయితే ఈ నిధులు కొంతమంది అవినీతి పరులైన ఉద్యోగుల వలన పక్కదారి పడుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జిల్లా క్షయ నియంత్రణ విభాగం ఒకటి. ఈ కార్యాలయం కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉంది.
అవినీతి జరిగింది ఇలా...
క్షయ వ్యాధిని నియంత్రించేందుకు జిల్లా క్షయ నియంత్రణ విభాగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూ.కోట్ల నిధులను కేటాయిస్తాయి. ఈ నిధులను క్షయ నియంత్రణకు సంబంధించిన అంశాలకు ఖర్చు చేయాలి. అయితే 2019 నుంచి 2025 ఏడాదిలో ఇప్పటి వరకు ఆ విభాగంలో పనిచేసే కొందరు ఉద్యోగులు నిధులను పక్కదారి పట్టించారు.
● ఎన్‌పీవై (నిక్షయ్ పోషణ యోజన) స్కీం కింద టీబీ పేషెంట్ల పౌష్టికాహారానికి సంబంధించి ప్రభుత్వం ఒకరికి ఒక నెలకు రూ.500 చొప్పున 6 నెలల కాలానికి రూ.3 వేలు అందజేస్తుంది. అలాగే క్షేత్ర స్థాయిలో పేషెంట్ ఆరోగ్య పరిరక్షణ, పర్యవేక్షణ బాధ్యతలను ‘ట్రీట్‌మెంట్ సపోర్టర్స్’గా ఆశాలు నిర్వహిస్తారు. ఈ ఆశాలకు కూడా ఒక పేషెంట్‌కు ఆరు నెలల కాలానికి రూ.3 వేలు వారి ఖాతాలకు జమ చేస్తారు. వ్యాధిగ్రస్తులకు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్) ద్వారా రూ.3 వేలు అందిస్తారు. ఈ నిధులకు సంబంధించి అక్కడ పనిచేసే ఉద్యోగులు అకౌంట్ నంబర్లను మార్చి తమకు అనుకూలమైన అకౌంట్లకు నిధులను జమ చేశారు. ట్రీట్‌మెంట్ సపోర్టర్స్‌కు ఇవ్వవలసిన డబ్బులను పీఎఫ్‌ఎంఎస్‌లో అకౌంట్లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్‌ను మార్పు చేసి అక్కడ పనిచేసే ఉద్యోగి తనకు సంబంధించిన వారి అనధికారిక ఖాతాలకు దాదాపు రూ.12 లక్షలు దారి మళ్లించారు. ఇందుకు సంబంధించి నోట్ ఫైల్, పీఎఫ్‌ఎంఎస్ నుంచి పంపిన అకౌంట్స్ వివరాలు, ట్రీట్‌మెంట్ సపోర్టర్స్ వివరాలను పరిశీలించాలి.
● జిల్లాలో 40 మంది టీబీ ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు. వారందరికీ పీఓఎల్ (పెట్రోల్ బిల్లులు) చెల్లించాలి. ఒకరికి ఒక నెలకు రూ.3500 వరకు వస్తుంది. ఈ బిల్లులను 5–6 నెలలకు ఒక సారి చెల్లిస్తారు. అందుకు గాను ఒకరి నుంచి రూ.2 వేలు వసూలు చేస్తారు. ఎందుకని అడిగితే జిల్లా అధికారులకు ఇవ్వాలని సమాధానం ఇస్తారు. అలాగే ఫీల్డ్ స్టాఫ్ మాత్రమే ఉపయోగించాల్సిన టూ వీలర్స్‌ను అక్కడ పనిచేసే ఉద్యోగి తన వాళ్లకు ఇచ్చారు. కొన్ని టూ వీలర్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా అక్కడ పనిచేసే ఉద్యోగే ఉపయోగిస్తున్నారు.
● ఈ పెట్రోల్ బిల్లులకు సంబంధించి అక్కడ పనిచేసే ఉద్యోగులు తమకు అనుకూలమైన ఎస్టీఎస్ (సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్), టీబీహెచ్‌ఎస్ (ఫీల్డ్ స్టాఫ్) ఎంపీహెచ్‌ఎస్‌లకు అధిక మొత్తంలో బిల్లులను మంజూరు చేస్తారు. అందుకు సంబంధించిన డబ్బును ఆ ఉద్యోగుల నుంచి వసూలు చేస్తారు. ఆ విధంగా వచ్చిన డబ్బును తమ ఖాతాల్లో వేసుకోకుండా అనుకూలమైన అక్కడే పనిచేసే ఉద్యోగులతో పాటు కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ చేశారు. ఈ ఖాతాలను పరిశీలిస్తే ఆ వివరాలు తెలుస్తాయి.
● టీబీ డ్రగ్స్‌కు సంబంధించి తప్పుడు బిల్లులను పొందుపరిచారు. ఈ డ్రగ్స్‌కు సంబంధించిన నోట్ ఫైల్‌తో పాటు డ్రగ్ బిల్స్, పీఎఫ్‌ఎంఎస్ నుంచి ఆ నగదును ఏ అకౌంట్, ఐఎఫ్‌ఎస్సీ కోడ్స్‌కు బదిలీ చేశారో పరిశీలించాలి.
ఉన్నతాధికారులకు ఫిర్యాదులు..
ఆ శాఖలో అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై ఈ నెల 12వ తేదీన ఓ వ్యక్తి రూ.5 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు .రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, విజయవాడ అవినీతి నిరోధక శాఖ, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర టీబీ నియంత్రణ అధికారితో పాలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర క్షయ నివారణ అధికారి డాక్టర్ రమేష్‌బాబును ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరూకురి విచారణకు ఆదేశించినట్లుగా సమాచారం.
విచారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి..
ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఆ శాఖలో ఉద్యోగుల మధ్య తీవ్ర చర్చజరుగుతోంది. అవినీతి సొమ్ముతో ఉద్యోగులు తమ సొంత పనులను చక్కబెట్టుకుంటున్నారని అనుకుంటున్నారు. అక్రమ సంపాదనలో ఏ అధికారికి ఎంత వాటా ఉంది. దీని వెనుక ఏ అధికారి ప్రమేయం..హస్తం ఉంది అనే అంశాలు వెలుగు చూడాల్సి ఉంది. కాగా ఫిర్యాదుదారుడు చాలా వరకు ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ అంశాలపై నిజాయితీగా లోతైన సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. అప్పుడే వచ్చిన ఆరోపణలు వాస్తవమా..అవాస్తవమా అనేది తేలుతుందని ఉద్యోగులు అంటున్నారు.
ప్రభుత్వ నిధులకు కన్నం
ఉద్యోగుల చేతి వాటం
ఉన్నతాధికారుల దృష్టికి అవినీతి బాగోతం
విచారణకు డీఎంహెచ్‌ఓను ఆదేశించాం...
క్షయ నియంత్రణ విభాగంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజును ఆదేశించాం. విచారణ చేపట్టిన తరువాత అందుకు సంబంధించిన నివేదికను తెప్పించుకొని పరిశీలించి, చర్యలు చేపడతాం.
– డాక్టర్ రమేష్‌బాబు, రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారి, జాయింట్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment