మూల్యాంకనానికి సర్వం సిద్ధం
కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం(స్పాట్ వ్యాల్యుయేషన్) సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ అధికారులు పూర్తి చేశారు. ఈ ప్రక్రియ ఈనెల 17వ తేదీ సోమవారం నుంచి కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వేదికగా ప్రారంభం కానుంది. ప్రధాన ద్వారంతోపాటు మూల్యాంకనం జరుగుతున్న అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దిద్దుబాటులో జరిగే తప్పులు, దోషాలకు ఎగ్జామినర్లు, సిబ్బంది బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ అధికారులు తెలిపారు.
నాలుగు విడతల్లో మూల్యాంకనం..
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన మూల్యాంకనం కోసం 2,05,000 జవాబు పత్రాలు జిల్లాకు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,85,253 పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. వీటిలో 1,75,393 కు కోడింగ్‌ను కూడా పూర్తి చేశారు. మిగతా వాటికి కోడింగ్ చేస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం మొత్తం నాలుగు విడతల్లో జరగనుంది. ఇందుకు సంబంధించి ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో మూల్యాంకనం జరగనుంది. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, 2వ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇందులో ఒక ఎగ్జామినర్ పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లను దిద్దాల్సి ఉంటుంది. ఈ మూల్యాంకనం కోసం 450 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 100 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 100 మంది స్క్రూటినైజర్లు, 25 మంది ఏసీఓలను నియమించినట్లు ఆర్‌ఐఓ తెలిపారు.
సిబ్బంది నియామకం పూర్తి..
మూల్యాంకన విధుల కోసం ఎగ్జామినటర్ల నియామక ఉత్తర్వులను ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే ఆయా కళాశాలలకు చేరవేసింది.పేపర్ వ్యాల్యుయేషన్ ప్రక్రియలో భాగంగా స్పాట్ క్యాంపు ఆఫీసర్‌గా ఆర్‌ఐఓ బండి వెంకటసుబ్బయ్య వ్యవహరిస్తారు. జనరల్–1 కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యారావు, జనరల్–2 గా కడప ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఉర్దూ లెక్చరర్ హబీబుల్లా, సీసీఓ–1గా ప్రొద్దుటూరు ఉర్దూ కాలేజీ ప్రిన్సిపాల్ రమణారెడ్డి, సీసీఓ–2గా కమలాపురం ఎయిడెడ్ కళాశాల ప్రిన్సిపాల్ సర్వేశ్వరరెడ్డి నియమితులయ్యారు. వీరితోపాటు కోడింగ్ ఆఫీసర్లు, ఏసీఓలు, సబ్జెక్టు ఎక్స్‌పర్ట్, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్ల నియామక ప్రక్రియ పూర్తయింది.
అధ్యాపకులను రిలీవ్ చేయకపోతే కళాశాలలకు జరిమానా
బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సివిక్స్, గణితం సబ్జెక్టులో చీఫ్ ఎగ్జామినర్లు, ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్లు తప్పని సరిగా రిలీవ్ చేయాలని స్పాట్ వాల్యూయేషన్ క్యాంప్ ఆఫీసర్ బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. కళాశాలల్లో రిలీవ్ అయిన అధ్యాపకులు 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంపునకు హాజరుకావాలన్నారు. వ్యాల్యూయేషన్ డ్యూటికి నియమితులైన అధ్యాపకులను రిలీవ్ చేయని కళాశాలలకు బోర్డు ద్వారా జరిమానా విధిస్తామన్నారు.
నేటి నుంచి ఇంటర్మీడియట్
మూల్యాంకనం ప్రారంభం
కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వేదికగా ఏర్పాట్లు
2,05,000 పేపర్లకు మూల్యాంకనం
నాలుగు విడతల్లో జరగనున్న స్పాట్ ప్రక్రియ
మూల్యాంకన విధులకు తప్పకుండా హాజరు కావాలి..
జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న మూల్యాంకన విధులకు కేటాయించిన సిబ్బంది తప్పక హాజరుకావాలి. మూల్యాంకన కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ను అనుమతించడం జరగదు. కేంద్రంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేశాం. పేపర్ల దిద్దుబాటులో అలసత్వం ప్రదర్శించి తప్పులు చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు.
– బండి వెంకటసుబ్బయ్య, ఆర్‌ఐఓ, ఇంటర్ స్పాట్ క్యాంపు ఆఫీసర్
మూల్యాంకనానికి సర్వం సిద్ధం
మూల్యాంకనానికి సర్వం సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment